కరోనా వైరస్ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వైరస్ కేంద్రబిందువు చైనా.. ఎగుమతి, దిగుమతులను గట్టిగానే దెబ్బతీస్తోంది. భారత్ మార్కెట్‌పైనా కరోనా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. భారత్‌లో కొన్ని పంటలు పండించిన రైతులకు కరోనా వరం కాగా.. మరికొందరికి శాపంగా మారింది. చైనా నుంచి సిల్క్ దిగుమతులు తగ్గి దేశీయ రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. వాము రైతులు మాత్రం ఆందోళనలో ఉన్నారు.
కర్ణాటక చిత్రదుర్గ లోని రామనగర సిల్క్ మార్కెట్‌కు చైనా నుంచి దిగుమతులు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో సిల్క్ రైతులకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇంతకు ముందు రూ. 325 నుంచి 375గా పలికిన సిల్క్ ధర ప్రస్తుతం రూ. 575 నుంచి రూ. 625కు చేరింది. పెరిగిన ధరలతో చిత్రదుర్గ ప్రాంతంలోని కుమారధికెరె, ముద్దపుర, బీజీ కెరె, ఎండీ కోటె, మొలకల్ముర్, చల్లకెరె రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు కంటే ఎక్కువగా పట్టును ఉత్పత్తి చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
"14 ఏళ్ల నుంచి పట్టుపురుగులు సాగు చేస్తున్నాను. పట్టుకు రేటు ఎప్పుడూ ఇంత పలకలేదు. మొదట్లో కేజీకి రూ. 85 రూపాయలు ఉండేది. మూడు నెలల కిందట రూ. 3వందలకు పైగా ధర పెరిగింది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం రూ.650 వరకు పలుకుతోంది."
-హనుమంతప్ప, రైతు, కుమారాధికెరె
బిందు సేద్య పద్ధతిలో తక్కువ పెట్టుబడితో పట్టును సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు ఇక్కడి రైతులు. బిందు సేద్య పద్ధతిలో సాగు చేసి రైతులు లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్నారని చెబుతున్నారు. సెరికల్చర్ అధికారి బాలకృష్ణ.