త్రివిధ దళాలకు కరోనా మహమ్మారి నుంచి రక్షణ కల్పించేందుకు భారత్ పటిష్ఠ వ్యూహం అమలుచేస్తోందని ఉద్ఘాటించారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. కరోనా రక్కసిపై పోరాడుతూనే... 'దుష్ట శక్తుల' నుంచి దేశాన్ని రక్షించేందుకు సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. ఇటీవల తరచుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్‌ను ఉద్దేశించి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు రాజ్‌నాథ్.
ప్రజల మద్దతుతో కరోనా భూతంపై కేంద్రం పోరాడుతోందని పీటీఐ ముఖాముఖిలో చెప్పారు రాజ్‌నాథ్.
"కొవిడ్-19 విజృంభణ... మునుపెన్నడూ చూడని అదృశ్య యుద్ధం. మానవాళికి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధమిది. యావద్దేశ ఆరోగ్య, ఆర్థిక భద్రతపైనే ప్రభావం పడే ప్రమాదముంది.
కరోనాపై భారత్ యుద్ధ ప్రాతిపదికన పని చేస్తోంది. ప్రభుత్వ విభాగాలన్నీ చక్కటి సమన్వయంతో పనిచేస్తున్నాయి. కరోనాపై పోరులో సాయుధ దళాలు దేశానికి అండగా నిలిచాయి."
-రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి
కమ్యూనికేషన్స్, సరఫరా వ్యవస్థ నిర్వహణ, వైద్య సాయం, ఇంజినీరింగ్ వంటి విషయాల్లో సాయుధ దళాలకున్న నైపుణ్యాలను కరోనాపై పోరు కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిపారు రాజ్‌నాథ్.