దేశంలో నెమ్మదిగా ప్రారంభమైన కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా 315 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. శనివారం ఒక్క రోజే 60 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న సాయంత్రం 6 గంటల వరకు 16,021 మందికి చెందిన 16,911 నమూనాలు పరీక్షించినట్లు తెలిపింది.
ఈ 315 మందిలో 17 మంది ఇటాలియన్లు సహా 39 మంది విదేశీయులున్నారు. దిల్లీ, కర్ణాటక, పంజాబ్, మహారాష్ట్ర నుంచి ఒక్కో కరోనా మరణం నమోదైనట్లు కేంద్రం తెలిపింది. 315 కరోనా కేసులలో మహారాష్ట్రలో అత్యధికంగా 63 మంది కొవిడ్-19 బాధితులు ఉన్నారు. కేరళలో ఏడుగురు విదేశీయులు సహా ఇప్పటివరకు మొత్తంగా 40 మందికి కరోనా తేలింది.
వివిధ రాష్ట్రాల్లో కేసుల వివరాలు ఇలా..
రాష్ట్రం | కేసుల సంఖ్య |
మహారాష్ట్ర | 63 |
కేరళ | 40 |
దిల్లీ | 27 |
ఉత్తర్ప్రదేశ్ | 24 |
తెలంగాణ | 21 |
రాజస్థాన్- హరియాణా | 34 |
కర్నాటక | 15 |
పంజాబ్- లద్ధాఖ్ | 26 |
గుజరాత్ | 7 |
జమ్ముకశ్మీర్ | 4 |
ఆంధ్రప్రదేశ్- ఉత్తరాఖండ్- బంగాల్ | 9 |
ఒడిశా | 2 |
పుదుచ్చేరి- ఛత్తీస్గఢ్- చండీగఢ్ | 3 |
ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారిలో 23 మంది పూర్తిగా కోలుకున్నట్లు కేంద్రం తెలిపింది. విదేశాల నుంచి వచ్చిన 306 మందిని ముంబయిలో ఐసోలేషన్లో ఉంచినట్లు బొంబాయి మునిసిపల్ కార్పొరేషన్ తెలిపింది.
రేపటి నుంచి ఈ నెల 31 వరకు పుదుచ్చేరిలో 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. మహారాష్ట్ర ఠాణేలో 10 మందికి మించి గుమిగూడడంపై నిషేధం విధించారు. అసోంలో తొలి కరోనా కేసు నమోదైంది. నాలుగున్నరేళ్ల చిన్నారికి వైరస్ సోకినట్లు అదికారులు తెలిపారు.