దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున కేంద్రంతో పాటు రాష్ట్రాలు జాగ్రత్త చర్యలను ముమ్మరం చేస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను మార్చి 31 వరకు మూసేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పది, ఇంటర్ పరీక్షలు మాత్రం షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశారు. మరోవైపు దిల్లీలో పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్లను ఈ నెల 31 వరకు మూసివేయాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. కరోనా వైరస్‌ను అంటువ్యాధిగా ప్రకటిస్తున్నట్లు తెలిపిన ఆయన.. వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నింట్లో చర్యలు చేపట్టడాన్ని తప్పనిసరి చేసినట్లు చెప్పారు. కేరళలోనూ విద్యాసంస్థలు, సినిమా హాళ్లను ఈ నెలాఖరు వరకు మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు.
దేశంలో 74కు చేరిన కేసులు
కొత్తగా మరో విదేశీయుడు సహా 14 మందిలో కరోనా (కొవిడ్-19) లక్షణాలు బయటపడినందున ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 74 మందికి ఈ వైరస్ సోకినట్లయింది. 74 మంది రోగులతో కలిసిమెలిసి తిరిగిన సుమారు 1500 మందిపై వైద్య పరిశీలన కొనసాగుతోంది. రోగుల్ని విడిగా ఉంచడానికి మరో ఏడు చోట్ల రక్షణ మంత్రిత్వశాఖ ఏర్పాట్లు చేసింది. శుక్రవారం నుంచి తిరిగి ప్రకటించేవరకు రాష్ట్రపతి భవన్లోనికి సందర్శకులకు అనుమతించమని అధికారులు తెలిపారు.