కరోనా వైరస్ కమ్ముకుంటూ... మనిషి ఆయువు తీసేస్తోంది. ఇది ఊపిరితిత్తులపై మాత్రమే దాడి చేస్తోందని ఇన్నాళ్లూ అనుకుంటూ ఉన్నాం. కానీ అలా ఊహిస్తే తప్పులో కాలేసినట్లే!! మనిషి శరీరంలోని అన్ని అవయవాలూ ఈ వైరస్ కోరల్లో చిక్కుకుంటున్నాయి. కళ్లు, గొంతు, గుండె, కాలేయం, మూత్రపిండాలు, మెదడు.. ఇలా ప్రతి అవయవాన్నీ ఇది లక్ష్యంగా చేసుకుంటోందని లండన్ కింగ్స్ కాలేజీ ఆసుపత్రికి చెందిన ప్రొఫెసర్ అజయ్ షా చెబుతున్నారు. తమ ఆసుపత్రిలో చేరిన రోగుల లక్షణాలను పరిశీలించిన తర్వాత ఆయన ఈ అంచనాకు వచ్చారు. ఇప్పటికే ఎటువంటి లక్షణాలు బయటపడని రోగులతోపాటు, వ్యాధి తగ్గిందనుకునేలోపే తిరగబెడుతున్న రోగుల్లోనూ ఈ వైరస్ అలజడి సృష్టిస్తోందని ఆయన వివరించారు. అజయ్‌షా చెప్పిన విషయాల్ని 'ది టెలిగ్రాఫ్' పత్రిక తాజాగా ప్రచురించింది.
ముక్కు నుంచి గొంతులోకి..
కరోనా వైరస్ మన శరీరంలోకి ప్రవేశించడానికి అత్యంత అనుకూలమైన మార్గం ముక్కు. తొలుత ఇది నాసికా రంధ్రాల్లో తిష్ఠవేస్తుంది. ఆ సమయంలో వాసన చూడటంలో రోగి సమస్యలను ఎదుర్కొంటాడు. వైరస్ ఆ తర్వాత మెల్లగా ముక్కు నుంచి గొంతులోకి చేరుతుంది. గొంతులోని మృదు చర్మంలో ఈ క్రిమి నిలిచేందుకు అవసరమైన ఏసీఈ2 సమృద్ధిగా ఉంటుంది. వైరస్‌కు ఉండే కొమ్ముల(స్పైక్) ప్రొటీన్ ఆసరాగా అక్కడ కణాల్లో చొరబడి పునరుత్పత్తి చేస్తుంది. ఈ సమయంలో రోగిలో వ్యాధి లక్షణాలు బయటపడకపోయినా.. చుట్టుపక్కల వారికి విపరీతంగా అంటించడంలో ఇది కీలకమైన దశ. వైరస్ గొంతులోకి ప్రవేశించిన తొలి దశలో మన రోగ నిరోధక కణాలు స్పందించకుంటే గాలిగొట్టం నుంచి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది.
ఊపిరితిత్తుల్లో అలజడి..
ఊపిరితిత్తుల్లోకి చేరగానే వైరస్ విజృంభిస్తుంది. అక్కడ లక్షల సంఖ్యలో ఉండే శ్వాసకోశాలను ఆక్రమిస్తుంది. ఈ క్రమంలో 'న్యుమోనైటిస్' అనే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఊపిరితిత్తుల కండరాల్లో వాపు కనిపిస్తుంది. రోగి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతాడు. అదేసమయంలో ఊపిరితిత్తుల్లోకి నీరు చేరి భారంగా మారుతుంది. కొందరురోగుల్లో 'అక్యూట్ రెస్పిరేటరి డిస్ట్రెస్ సిండ్రోమ్' కనిపిస్తుంది. అప్పుడు రక్తంలో ప్రాణవాయువు ప్రమాదకర స్థాయికి తగ్గిపోతుంది. ఈ దశలో వెంటిలేటర్లు వాడి రోగి ప్రాణాలను కాపాడొచ్చు. అలాగని వైరస్ వ్యాప్తిని ఆపలేం. బాధితుడిలోని వ్యాధి నిరోధక కణాలు బలపడి వైరస్‌ను ఎదుర్కొనే వరకు వేచి ఉండాల్సిందే. ఈ దశలో చాలా మంది రోగుల్లో శరీరం అతిగా స్పందించడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. రోగ నిరోధక కణాలు అదుపుతప్పి శరీర భాగాలపై కూడా దాడిచేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దశలో శరీరం మొత్తం వాపు ప్రక్రియ పెరిగిపోయి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. రక్తనాళాల్లో వాపు వస్తుంది. దీంతో 20 శాతం రోగుల్లో కిడ్నీలు దెబ్బతింటున్నాయి. ఇది గుండె సమస్యలకు సైతం కారణం అవుతోందని భావిస్తున్నారు. అందుకే ఐసీయూల్లో చనిపోయేవారు 'సైటోకైన్ స్ట్రామ్'తో, వివిధ అవయవాలు పనిచేయక పోవడం వల్ల ప్రాణాలు వదులుతున్నారు.
గుండెపై ఒత్తిడి పెంచి..
ఈ వైరస్ గుండె, రక్తనాళాలపై ఎలా దాడి చేస్తోందనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. శరీరంలోని రక్తనాళాల గోడలపై దాడి చేసి వాపును సృష్టిస్తోంది. ఇది గుండె జబ్బులకు దారితీస్తోంది. చైనాలోని వుహాన్‌లో 416 మంది కరోనా బాధితులపై నిర్వహించిన పరిశోధనలో 20 శాతం మంది గుండె సమస్యలతో మరణించినట్లు 'జామా కార్డియాలజీ జర్నల్' పేర్కొంది. కొవిడ్ తీవ్ర స్థాయిలో ఉన్న రోగుల్లో రక్తనాళాల్లో వాపు ఎక్కువగా కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. అందుకే మధుమేహం, గుండెజబ్బులు ఉన్న వారికి ఇది ప్రాణాంతకమని హెచ్చరిస్తున్నారు.
కాలేయం దెబ్బతిని..