కరోనా వైరస్ భారత్‌లో అంతకంతకూ విస్తరిస్తోంది. కరోనా మహమ్మారి ధాటికి ఇప్పటివరకు 56 మంది మరణించారు. గత 24 గంటల్లోనే కొత్తగా 336 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 2301 కొవిడ్-19 కేసులు నమోదవగా.. 157 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 2088 యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
గడిచిన రెండు రోజుల్లోనే దేశంలోని 14 రాష్ట్రాల్లో 647 కొత్త కరోనా కేసులు, 12 మరణాలు నమోదవగా.. వీరందరూ తబ్లీగీ జమాత్‌తో సంబంధమున్నవారేనని అధికారులు తేల్చారు.
రాష్ట్రాల వారీగా..
తమిళనాడులో ఒక్కరోజే 102
తమిళనాడులో ఇవాళ ఒక్క రోజే 102 కొత్త కేసులు బయటపడ్డాయి. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 411కి చేరింది. ఇప్పటివరకు ఒకరు మృతి చెందగా.. మరో ఐదుగురు కోలుకున్నారు.
దిల్లీ:
దిల్లీలో గడచిన 24 గంటల్లో 91 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 384కి పెరిగింది. నిజాముద్దీన్ ఘటనతోనే వైరస్ ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపారు.
రాజస్థాన్:
రాజస్థాన్‌లో ఇవాళ కొత్తగా 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో 8 మంది మర్కజ్‌కు హాజరైన వారే కావడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 154 మందికి వైరస్ సోకగా, ముగ్గురు చనిపోయారు. మరో 11 మంది కోలుకున్నారు.