తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా వలయంలో భారత్​.. ఎక్కడ చూసినా ఆంక్షలే

యావత్‌ ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మహమ్మారి.. భారత్​లో మరో ఇద్దరికి సోకింది. ఫలితంగా దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 84కు చేరింది. వైరస్‌ కట్టడికి ముమ్మర చర్యలు తీసుకుంటున్న కేంద్రం.. బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, పాకిస్థాన్ సరిహద్దులను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

Corona cases in India rises to 84
కరోనా వలయంలో భారత్​.. ఎక్కడ చూసినా ఆంక్షలే

By

Published : Mar 15, 2020, 5:40 AM IST

Updated : Mar 15, 2020, 7:08 AM IST

దేశంలో చాపకిందనీరులా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి మరో ఇద్దరికి పాజిటివ్​గా​ వచ్చింది. ఫలితంగా దేశంలో కరోనా బారినపడ్డవారి సంఖ్య 84కు చేరింది. ఈ నేపథ్యంలో వైరస్​ కట్టడికి చర్యలు తీసుకుంటున్న కేంద్రం.. బంగ్లాదేశ్, పాకిస్థాన్​, భూటాన్, మయన్మార్ దేశాల సరిహద్దుల నుంచి అన్ని రకాల ప్రయాణాలను రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా నివారణ కోసం రాష్ట్ర ప్రకృతి విపత్తు ఉపశమన నిధి (ఎస్​డీఆర్​ఎఫ్)​ నుంచి ఖర్చు చేసుకునేందుకు అన్ని రాష్ట్రాలకు అనుమతిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత కరోనా మృతులకు రూ.4 లక్షల పరిహారం, రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన మేరకు వైద్య ఖర్చులు చెల్లించడానికి అనుమతించిన కేంద్రం.. వెంటనే ఆ రెండింటినీ తొలగిస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది.

అన్నిచోట్లా 'మూతే'

ఈ మహమ్మారిని ఇప్పటికే జాతీయ విపత్తుగా ప్రకటించింది కేంద్రం. వైరస్​ కారణంగా ఇప్పటివరకు కర్ణాటకలో ఒకరు, దిల్లీలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. శనివారం తెలంగాణలో మరొకటి, దేశ రాజధానిలో ఏడో కరోనా కేసు నమోదుకాగా.. మహారాష్ట్రలో ఈ కేసుల సంఖ్య 31కి చేరింది. శనివారం పుణె, ముంబయి, నాగ్‌పుర్‌, యావత్మల్ ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వైరస్‌ను కట్టడి చేసేందుకు.. పలు రాష్ట్రాలు పాఠశాలలు, కళాశాలలు, థియేటర్లను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. మహారాష్ట్రలో ఈ నెల 31వరకు పాఠశాలలు, కళాశాలలు మూసివేస్తున్నట్లు ప్రకటించగా..జమ్ముకశ్మీర్ లోని కిస్టావర్‌, రాంబన్ జిల్లాల్లో ఐదుగురు కంటే ఎక్కువమంది గుమికూడకుండా అధికారులు నిషేధాజ్ఞలు విధించారు. థియేటర్లు మూసివేత సహా సాంస్కృతిక కార్యక్రమాలను రద్దుచేస్తూ పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 16 నుంచి అన్నిరకాల వీసా అపాయింట్‌మెంట్లను రద్దుచేస్తున్నట్లు దేశంలోని అమెరికా కాన్సులేట్లు ప్రకటించాయి.

కర్ణాటక సర్కారు సూచనలతో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ బెంగళూరులోని ఓ కార్యాలయాన్ని ఖాళీచేసింది. భూటాన్‌తో ఉన్న సరిహద్దులను బెంగాల్ మూసివేసింది. కర్ణటక కలబుర్గిలోని ఇటీవల చనిపోయిన వ్యక్తి బంధువులను ఇంటర్వ్యూచేసిన నలుగురు జర్నలిస్టులు స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు.

Last Updated : Mar 15, 2020, 7:08 AM IST

ABOUT THE AUTHOR

...view details