తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమ్మ నేర్పిన మొక్కజొన్న బొమ్మే ఆదాయ వనరు

మొక్క జొన్న పొత్తులు కనిపిస్తే చాలు వేడి వేడిగా కాల్చుకుని నిమ్మకాయ, ఉప్పు వేసుకుని ఎంచక్కా లాగించేస్తాం. వాటిపై ఉండే ఆకులను చెత్తబుట్టలో పడేస్తాం. కానీ ఓ పూల వ్యాపారి మాత్రం వాటితో బుజ్జి బుజ్జి బొమ్మలు తయారు చేస్తోంది.. తన సృజనను జోడించి చెత్తతో విజయవంతంగా వ్యాపారం చేస్తోంది.

అమ్మ నేర్పిన మొక్కజొన్న బొమ్మే ఆదాయ వనరు

By

Published : Jul 16, 2019, 2:10 PM IST

అమ్మ నేర్పిన మొక్కజొన్న బొమ్మే ఆదాయ వనరు

నెలీ చాచియా.... మణిపుర్​ సేనాపతి జిల్లా సోంగ్​సోంగ్​ గ్రామానికి చెందిన పూల వ్యాపారి. పూల అమ్మకంతో సరిపెట్టలేదు ఆమె. అదనపు ఆదాయం కోసం అన్వేషించింది. సృజనకు కార్యరూపం కల్పించింది. మొక్కజొన్న పొత్తుల ఆకులతో అందమైన బొమ్మలు తయారు చేసి అందరినీ ఆకర్షిస్తోంది. ఆకులతో బొమ్మ శరీరాన్ని, పీచుతో ఆ బొమ్మకు జుట్టు తయారు చేసి వారెవా అనిపిస్తోంది. నెలీ చాచియా బొమ్మలు ఇప్పుడు దేశమంతా ఎగుమతి అవుతున్నాయి.

"ప్రస్తుతం నా బొమ్మలను ఇంఫాల్​, నాగాలాండ్, ముంబయికి ఎగుమతి చేస్తున్నాను. బొమ్మలకు అద్భుత ఆదరణ దక్కుతోంది. ప్రజలు నా కళను మెచ్చుకుంటున్నారు. ఈ బొమ్మలను ఎన్నో ప్రదర్శనలలో ఉంచమని కోరుతున్నారు."

-నెలీ చాచియా, పూల వ్యాపారి

అమ్మ చేతి బొమ్మే తనకు పుత్తడి బొమ్మగా ...

చాచియాకు చిన్నప్పుడు అమ్మ నేర్పిన ఆటే ఇప్పుడామెకు దేశవ్యాప్త గుర్తింపు తెచ్చిపెట్టింది. ఓ రోజు తన కోసం సరదాగా వాళ్లమ్మ మొక్క జొన్న కంకి ఆకులతో బొమ్మ చేసి ఇచ్చింది. ఆ బొమ్మ తనకెంతో నచ్చింది. అప్పటి నుంచి ఎప్పుడు మొక్కజొన్న తిన్నా.. అలాంటి బొమ్మ తయారు చేయించుకునేది.

"నా చిన్నతనంలో మా అమ్మ నాకు ఈ బొమ్మలు తయారు చేయడం నేర్పింది. నేను 2002లో నా వృత్తిగా మార్చుకున్నాను. రోజుకు 10-12 బొమ్మలు తయారు చేస్తాను. ఒక్కో బొమ్మను రూ.200 నుంచి రూ.500 వరకు అమ్ముతాను."

-నెలీ చాచియా, పూల వ్యాపారి

నెలీ మొక్క జొన్న పొత్తుల బొమ్మలు, పూల బుట్టల తయారీలో ఇప్పటివరకు ఎంతో మందికి శిక్షణ ఇచ్చింది. 2007లో దిల్లీలో జరిగిన రెండో అంతర్జాతీయ పూల ప్రదర్శనలో పాల్గొంది. పూలతో, ఆకులతో తయారైన ఆమె బొమ్మలకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నుంచి ప్రశంసలు లభించాయి.

ఇదీ చూడండి:కారు వదిలి నాటు పడవలో కొత్త జంట ప్రయాణం

ABOUT THE AUTHOR

...view details