ఆ సంస్థ పేరు చెబితే అవినీతిపరులకు, ఉగ్రవాదులకు, నేరస్థులకు హడల్... కానీ, అది భారత్‌లో లేదు. అమెరికాలో ఉంది. దాని పేరు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ). దీన్ని పోలిన దర్యాప్తు సంస్థ ఇండియాలోనూ ఉంది. కానీ, ఆ పోలిక పేరు వరకే పరిమితం. కేంద్ర దర్యాప్తు సంస్థ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్-సీబీఐ)గా వ్యవహరించే ఆ సంస్థ కేంద్రంలో అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మ అనే విమర్శ ఉంది. ప్రత్యర్థులను హడలెత్తించడానికి ప్రభుత్వాలు ఆ సంస్థను ఉపయోగిస్తాయనే ఆరోపణ ఉంది.
నిజానికి కేంద్ర దర్యాప్తు సంస్థ(కేదస)ది అంపశయ్య మీది భీష్ముడి పరిస్థితే. కేవలం సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే వల్లే అది ఇంకా కార్యకలాపాలు సాగించగలుగుతోంది. ఆరేళ్లక్రితం గువాహటి హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పు కేదస ఉనికికి ఎసరు పెట్టగా- సుప్రీంకోర్టు పుణ్యమా అని ఆ సంస్థ దినదిన గండంగా బండి నడిపిస్తోంది. కేదస స్థాపనకు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వు రాజ్యాంగవిరుద్ధమంటూ గువాహటి హైకోర్టు 2013 నవంబరు 6న దాన్ని కొట్టివేయడంతో సంస్థ రద్దు అనివార్యమైంది. ఫలానా సంస్థ లేదా ఫలానా బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ఏ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చినా, అది దేశమంతటికీ వర్తిస్తుంది.
కేదసకు వేల కేసులు అప్పగించి, చాలా కేసుల్లో శిక్షలు పడేట్లు చూసిన కేంద్ర ప్రభుత్వానికి గువాహటి హైకోర్టు తీర్పుతో గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయింది. దాంతో నాటి అటార్నీ జనరల్ గులాం వాహనవటిని హుటాహుటిన అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం వద్దకు పంపింది. అవి కోర్టులకు సెలవు దినాలు కావడంతో వాహనవటి ప్రధాన న్యాయమూర్తిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న జస్టిస్ సదాశివం తన నివాసంలోనే వేగంగా విచారణ జరిపి గువాహటి హైకోర్టు తీర్పు అమలును నిలుపుతూ స్టే ఇచ్చారు. ఇది జరిగి ఆరేళ్లయింది. సుప్రీం స్టే వల్లనే ఇప్పటికీ కేదస ఊపిరి పీలుస్తోంది. గువాహటి హైకోర్టు తీర్పునకు కొన్ని నెలల ముందే సుప్రీంకోర్టు కేదసను ‘పంజరంలో చిలక’ అని వర్ణించింది. కానీ, పకడ్బందీ ప్రత్యామ్నాయం ఏర్పడే వరకు ఈ సంస్థను కొనసాగించక తప్పదని గ్రహించింది.
బలహీన పునాదులపై....
కేంద్ర దర్యాప్తు సంస్థను రాజ్యాంగవిరుద్ధ పద్ధతుల్లో నెలకొల్పారంటూ గువాహటి హైకోర్టు తీర్పు ఇవ్వడానికి కారణం- నవేంద్ర కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఒక ఫిర్యాదు. కేదస దర్యాప్తు నివేదిక ఆధారంగా విచారణను ఎదుర్కొంటున్న కుమార్, అసలు కేదస స్థాపననే సవాలు చేశారు. అది ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా అవతరించిన దర్యాప్తు సంస్థ తప్ప రాజ్యాంగబద్ధ చట్టం ద్వారా ఏర్పడినది కాదన్నారు. కాబట్టి, ఆ సంస్థకు అరెస్టులు, సోదాలు, దర్యాప్తు జరిపి అభియోగ పత్రం దాఖలు చేసే అధికారాలు లేవని కుమార్ వాదించారు.
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ముందు కేదస ఉన్నతాధికారుల మధ్య జరిగిన రగడ, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇలాకాలోకి కేదసను అనుమతించేది లేదని భీష్మించడం చూస్తే కేంద్ర దర్యాప్తు సంస్థ పునాదులు మహా పెళుసని అవగతమవుతుంది. గతంలో కేదసలో ‘నంబర్ ఒన్, నంబర్ టూ’ అధికారులైన అలోక్ వర్మ, రాకేశ్ అస్థానాలు ఒకరి మీద ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడం, కొందరు అధికారులు లంచం తీసుకుంటూ దొరికిపోవడం, అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న బృందాన్ని అర్ధరాత్రిపూట బదిలీ చేయడం- ఇవన్నీ కేదస విశ్వసనీయతను దెబ్బతీశాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కేదసను తన ప్రత్యర్థులపైకి ఉసిగొల్పడం రివాజు అయిపోయి, న్యాయవ్యవస్థ పదేపదే జోక్యం చేసుకోవలసి వస్తోంది.
ఇక్కడ కేదస పుట్టుపూర్వోత్తరాల గురించి ఒకసారి చెప్పుకోవాలి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నాటి బ్రిటిష్ వలస ప్రభుత్వం అసాధారణ అధికారాలను ఉపయోగించి ఒక ఆర్డినెన్సు ద్వారా నెలకొల్పిన ప్రత్యేక పోలీసు సంస్థ (ఎస్‌పీఈ) ఆ తరవాత సీబీఐగా మారింది. 1946లో ఈ ఆర్డినెన్సు స్థానంలో దిల్లీ ఎస్‌పీఈ (డీఎస్‌పీఈ) చట్టం తెచ్చారు. మొదట్లో తాగు నీటి సరఫరా విభాగంలో లంచం, అవినీతి కేసులపై దర్యాప్తు జరపడానికి ఎస్‌పీఈని వినియోగించేవారు. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ శాఖ పర్యవేక్షణలో ఉన్న ఎస్‌పీఈ పరిధిని క్రమంగా అన్ని ప్రభుత్వ విభాగాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరించారు.
చివరకు 1963లో కేంద్ర హోంశాఖ తీర్మానం వల్ల ఎస్‌పీఈ కేంద్ర దర్యాప్తు సంస్థగా అవతరించింది. ఏదైనా రాష్ట్రంలో సంస్థ దర్యాప్తు జరపాలంటే సదరు రాష్ట్ర ప్రభుత్వ సాధికార అనుమతి కావాలని డీఎస్‌పీఈ చట్టంలోని ఆరవ సెక్షన్ నిర్దేశిస్తోంది. కేదస కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరిగిన నేరాలపై దర్యాప్తు జరపవచ్చు. సుప్రీంకోర్టు, హైకోర్టుల ఆదేశాలపై నేర దర్యాప్తు చేపట్టవచ్చు. కానీ, రాష్ట్రాల్లో దర్యాప్తు జరపాలంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి.
ఇంతా చేసి కేదస స్థాపన వెనక ఎటువంటి చట్టమూ లేకపోవడంతో ఆ సంస్థకు జన్మనిచ్చిన 1963నాటి హోంశాఖ తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని గువాహటి హైకోర్టు తీర్పుచెప్పింది. దీనికి కారణం- ఆ తీర్మానం కేంద్ర మంత్రివర్గ నిర్ణయం వల్లనో, లేక రాష్ట్రపతి ఉత్తర్వుల వల్లనో చేసినది కాకపోవడం. ఆలాగని 1946నాటి డీఎస్‌పీఈ చట్టానికి రాజ్యాంగబద్ధత లేదని న్యాయస్థానం పేర్కొనలేదు. కోర్టు చెప్పినదేమంటే కేదస- డీఎస్‌పీఈ చట్టం కింద ఏర్పడిన సంస్థ కాదు కాబట్టి, దాన్ని ఓ పోలీసు బలగంగా పరిగణించలేమని మాత్రమే.
అసలు 1963నాటి హోంశాఖ తీర్మానమే కేదసను తాత్కాలిక ప్రాతిపదికపై ఏర్పరచింది. కేదస స్థాపనకు పక్కాగా చట్టం చేసేంతవరకే పై తీర్మానం కొన్ని పరిమితులతో చెల్లుబాటవుతుందని వివరించింది. ఈ అయోమయాన్ని తొలగించాలంటే కేదస కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని 2017లో ఒక పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. ఉగ్రవాద నేరాలతోపాటు సంఘటిత ముఠాల (మాఫియా) నేరాలు, అంతర్జాతీయ నేరాలను శోధించడానికి తగు అనుభవం, నైపుణ్యం కేదసకు మాత్రమే ఉంది. కానీ, డీఎస్‌పీఈ చట్టం కింద ఆ సంస్థకు దఖలు పడిన అధికారాలు చాలా పరిమితం.