సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్.. భారత్‌దేశంలో అధికార పార్టీ భాజపాకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ అమెరికాకు చెందిన ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ ప్రచురించిన ప్రత్యేక కథనం అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ద్వేష భావాన్ని రెచ్చగొట్టేలా ఉన్న అంశాల్లో నిబంధనలను భాజపా నేతలకు ఫేస్‌బుక్ వర్తింపజేయడం లేదనేది కథనం సారాంశం. వ్యాపార ప్రయోజనాల పరిరక్షణ కోసమే ఫేస్‌బుక్ ఇలా పక్షపాత పూరితంగా వ్యవహరిస్తోందని కూడా కథనం పేర్కొంది. భాజపా ఎమ్మెల్యే ఒకరు గతంలో రోహింగ్యాల విషయంలో చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా ఉటంకించింది.
'వాస్తవాలు బయటపడ్డాయి'
ఈ కథనంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించారు. ఫేస్‌బుక్, వాట్సప్‌లను ఉపయోగించుకుని తప్పుడు వార్తల్ని, విద్వేషాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి, తద్వారా ఓటర్లను ప్రభావితం చేయడానికి భాజపా-ఆరెస్సెస్‌లు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఫేస్‌బుక్ గురించి ఎట్టకేలకు అమెరికాలోని పత్రిక బయటపెట్టిందని చెప్పారు.
ప్రజాస్వామ్య పునాదులకే ముప్పు కలిగించేలా ఉన్న పరిణామాలపై సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ)తో విచారణ జరిపించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ మకెన్ డిమాండ్ చేశారు. విశ్వసనీయతను దెబ్బతీసేలా పనిచేస్తున్న ఉద్యోగులపై ఫేస్‌బుక్ గ్లోబల్ సంస్థ విచారణ జరపాలన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాల విషయంలో ఫేస్‌బుక్ ఏం చేయదలచుకుందో ఆ సంస్థ నుంచే తెలుసుకుంటామని ఐటీపై పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ శశిథరూర్ చెప్పారు.
'గతాన్ని గుర్తు చేసుకోండి'
ఆరోపణలపై కేంద్ర ఐ.టి.శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ.. ఫేస్‌బుక్ పోస్టుల వివరాల ఆధారంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయడానికి 2018లో ప్రయత్నించిన (కేంబ్రిడ్జి అనలిటికా) ఉదంతాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసుకోవాలని సూచించారు. యావత్ ప్రపంచాన్ని భాజపా, ఆరెస్సెస్‌లు నియంత్రిస్తున్నాయన్నట్లు తమని ఆడిపోసుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు. బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్య (భాజపా) కాస్త భిన్నంగా స్పందించారు. జాతీయవాద, హిందూ అనుకూల వ్యాఖ్యలను ఫేస్‌బుక్ అనుచితంగా కత్తిరిస్తోందన్న ఫిర్యాదులు అనేకమంది నుంచి వస్తున్నాయని, దీనిని తగిన వేదిక ద్వారా ఆ సంస్థ దృష్టికి తీసుకువెళ్తానని ఐటీ పార్లమెంటరీ కమిటీ సభ్యుడు కూడా అయిన తేజస్వీ సూర్య చెప్పారు.
'పార్టీలతో సంబంధం లేదు'
తమపై వచ్చిన ఆరోపణల్ని ఫేస్‌బుక్ తోసిపుచ్చింది. ఏ దేశంలో ఏ పార్టీతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ‘భారత్‌లో అధికార భాజపాతో మాకు ఎలాంటి సంబంధాలు లేవు. ఏ ఒక్కరి రాజకీయ హోదా, రాజకీయ అనుబంధాలతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఒకే విధానాలను మేం అనుసరిస్తాం’ అని సంస్థ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. హింసను, ద్వేషాన్ని రగలించే అంశాలను తాము నిషేధిస్తున్నామని చెప్పారు. అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉందని, నిష్పాక్షికంగా ఉండేలా తమ ప్రక్రియను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నామని వివరించారు.
ఆ కథనంలో ఏముందంటే..
మతపరమైన వ్యాఖ్యలు చేసిన ఓ భాజపా ఎమ్మెల్యేపై శాశ్వత నిషేధం విధించకుండా ఫేస్‌బుక్‌కు చెందిన మన దేశ సీనియర్ అధికారి ఒకరు అడ్డుపడ్డారంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం చెబుతోంది. సంస్థ అంతర్గత ఉత్తర ప్రత్యుత్తరాల్లో ఆయన జోక్యం చేసుకున్నారని శుక్రవారం ప్రచురించిన కథనంలో తెలిపింది. భాజపా నేతలు, కార్యకర్తల నుంచి వచ్చే అభ్యంతరకర వ్యాఖ్యలపై ఫేస్‌బుక్ పక్షపాతం చూపిస్తోందని ఆరోపించింది. భాజపా పట్ల ఆశ్రిత పక్షపాత వైఖరిని ఆ సంస్థ కనపరుస్తోందని పేర్కొంది. ఒకవేళ భాజపా నేతల పోస్టులపై కొరడా ఝళిపిస్తే కంపెనీ వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆ సంస్థ భావిస్తున్నట్లు ఫేస్‌బుక్ అధికారి ఒకరిని ఉటంకిస్తూ తెలిపింది.
ఇదీ చూడండి: గగన్‌యాన్: తొలి మానవరహిత ప్రయోగం వాయిదా!