ఐఎన్ఎక్స్- మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చుట్టూ సీబీఐ ఉచ్చు బిగిస్తోంది. ఏక్షణమైనా చిదంబరాన్ని అరెస్ట్ చేసేందుకు.. సీబీఐ సర్వం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణానికి సంబంధించి అవినీతి, మనీ లాండరింగ్ కేసుల్లో చిదంబరం దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను దిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.
అనంతరం..ఆరుగురు సభ్యుల సీబీఐ బృందం దిల్లీలోని చిదంబరం నివాసానికి వెళ్లింది. ఆ సమయంలో ఆయన తన నివాసంలో లేకపోవటం వల్ల వారు తిరిగి వెళ్లారు. తర్వాత ఉన్నతాధికారులతో చర్చించిన సీబీఐ అధికారులు మరోసారి చిదంబరం ఇంటికి వెళ్లి నోటీసులు అంటించారు.
సీబీఐ డిప్యూటీ ఎస్పీ ఆర్ పార్థసారథి ముందు రెండు గంటల్లో హాజరు కావాలని నోటీసుల్లో సీబీఐ పేర్కొంది. చిదంబరం ఫోన్లు స్విఛ్చాఫ్ చేసి ఉన్నాయని సమాచారం. ఇంటికి అంటించిన నోటీసును ఆయన మెయిల్ ఐడీకి పంపినట్లు సమాచారం. ఈడీ అధికారులు చిదంబరాన్ని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అరెస్ట్ నుంచి రక్షణ పొందేందుకు ఆయన సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ నేడు విచారణకు వచ్చే అవకాశం ఉంది. నోటీసులపై చిదంబరం తరఫు న్యాయవాది స్పందించారు. ఏ న్యాయసూత్రాల ప్రకారం తన క్లయింట్‌ను 2 గంటల్లో హాజరు కావాలని ఆదేశించారో నోటీసుల్లో పేర్కొనలేదన్నారు. నేడు సుప్రీంలో చిదంబరం బెయిల్ పిటిషన్ విచారణకు రానుందని.. అంతవరకు ఆయనను అరెస్ట్ చేయరాదని తెలిపారు.
ఇదీ చూడండి: ఐఎన్ఎక్స్ కేసు: చిదంబరంపై ఆరోపణలు ఏంటి?
చిదంబరం భవితవ్యంపై సుప్రీంలో నేడే విచారణ!