19 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పార్టీకి నూతన ఉత్తేజాన్నందించారు సోనియా గాంధీ. రాజీవ్ గాంధీ మరణానంతరం పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచారు. 2004, 2009 లోక్సభ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, యూపీఏ కూటమి ఏర్పాటు చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. మరి 2019 లోక్సభ ఎన్నికల్లో ఆమె పాత్ర ఏంటి..?
72 ఏళ్ల వయసులో ఇక రాజకీయాలకు స్వస్తి పలుకుతారేమో అని నాయకులు, కార్యకర్తలు ఊహించారు. ఆ ఊహాగానాలకు తెరదించింది కాంగ్రెస్. రానున్న లోక్సభ ఎన్నికల అభ్యర్థుల జాబితాలో మొదటి పేరు సోనియా గాంధీదే ఉంది.
యువరక్తం..
రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక పార్టీ వ్యవహారాల్లో సోనియా గాంధీ అంత చురుగ్గా లేరు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీని మూడింట అధికారంలోకి తీసుకువచ్చి రాహుల్ గాంధీ తన నాయకత్వ లక్షణాలను కనబరిచారని పార్టీ సీనియర్లు కితాబిచ్చారు.
కొద్ది నెలల క్రితం సోనియా గాంధీ కూమార్తె ప్రియాంక గాంధీ తన క్రియాశీలక రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అటు కుమారుడు రాహుల్, ఇటు కుమార్తె ప్రియాంక ఇద్దరూ రానున్న లోక్సభ ఎన్నికల్లో తమదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. యువ ఓటర్లపై వీరి ప్రభావం కచ్చితంగా ఉంటుందని పార్టీ భావిస్తోంది. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక సహా ప్రచార వ్యవహారాలపై వీరు దృష్టి పెట్టనున్నారు.
ఆమె పాత్ర ఏంటి..?
యూపీఏ-1, యూపీఏ-2 కూటమి ఏర్పాటులో సోనియా గాంధీ కీలకంగా వ్యవహరించారు. విపక్షాలను ఏకతాటిపైకి తేవడంలో ఆమె చాకచక్యంగా వ్యవహరించారని పార్టీ సీనియర్లు ఇప్పటికీ ప్రస్తావిస్తారు. ప్రస్తుత సమయంలో భాజపాను ఎదుర్కోవాలంటే సోనియా గాంధీ మంత్రాంగం అవసరమని పార్టీ భావిస్తోంది. మరో కీలక కూటమి ఏర్పాటులో ఆమె రాజకీయ అనుభవంపై పార్టీకి చాలా విశ్వాసం ఉంది.