కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 13 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో కుమారస్వామి సర్కార్ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి కూటమి పార్టీలు మధ్య నెలకొన్న అంతర్గత కలహాలే కారణమని భాజపా విమర్శించింది. కూటమిని కూల్చేందుకు భాజపా ప్రయత్నాలు చేస్తోందన్న అధికార ప్రభుత్వం ఆరోపణను ఖండించింది.
అధికార పార్టీల ఎమ్మెల్యేల రాజీనామాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని భాజపా మీడియా ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు అనిల్ బలూని తెలిపారు. రాజకీయ ఆధిపత్యం కోసం కాంగ్రెస్-జేడీఎస్ మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగడం సిద్దరామయ్యకు ఇష్టం లేదని ఆరోపించారు. కర్ణాటకలో నెలకొన్న అస్థిత్వానికి ఈ రెండు పార్టీల ధోరణి కారణమని ఘాటు విమర్శలు చేశారు అనిల్.