దిల్లీలో ఆమ్-ఆద్మీ పార్టీతో పొత్తుపై కాంగ్రెస్ చర్చలు నడుపుతోంది. ఇరు పార్టీల లక్ష్యం భాజపాను ఓడించడమే కాబట్టి కలసి పోటీ చేసే అంశంపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఆమ్ఆద్మీ నేతలతో, సొంత పార్టీ సీనియర్లతోనూ వరుస భేటీలు నిర్వహిస్తోంది.
దిల్లీలో ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు తొలుత ప్రకటించింది కాంగ్రెస్. అయితే ఆమ్ఆద్మీతో పొత్తు లోక్సభ ఎన్నికల్లో కలిసొస్తుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు.
మంతనాలు..
పొత్తుపై ఆమ్-ఆద్మీ పార్టీ నేతలతో కాంగ్రెస్ నాయకత్వం చర్చలు జరుపుతుంది. పార్టీ సీనియర్ నాయుకులతోనూ సమావేశాలు నిర్వహిస్తోంది.
దిల్లీలో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు భాజపాను, మోదీని తక్షణం ఓడించడమే పార్టీ ముందున్న లక్ష్యమని భావిస్తున్నారు. దాని కోసం ఆమ్-ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్నది మెజారిటీ దిల్లీ కాంగ్రెస్ నాయకుల అభిప్రాయం. ఈ విషయంలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. దీనిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. మా పార్టీ కార్యవర్గ సమావేశంలో భాజపాను వ్యతిరేకించే పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించాము. దిల్లీ కాంగ్రెస్ నాయకులూ ఈ నిర్ణయాన్ని శిరసావహిస్తారు. - పీసీచాకో, దిల్లీ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు