మోదీ సర్కారు పేదలకు వ్యతిరేకం:ప్రియాంక చతుర్వేది ప్రధాని నరేంద్ర మోదీది పేదల వ్యతిరేక ప్రభుత్వమని కాంగ్రెస్ మరోసారి విమర్శలు గుప్పించింది. 'మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం' కింద కార్మికుల వార్షిక వేతనాలను సగటున ఏటా 2.16 శాతం మాత్రమే పెంచడాన్ని తప్పుపట్టింది. ఈ చర్య మోదీకున్న 'పేదల వ్యతిరేక' భావనలను ప్రస్ఫుటం చేస్తోందని దుయ్యబట్టింది. భాజపా ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది. ప్రచారార్భాటాలకు రూ.5వేల200 కోట్లు ఖర్చు చేసిన మోదీ, అదే సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించారని విమర్శించారు.
మోదీ ప్రభుత్వం 'సంపన్నుల అనుకూల- పేదల వ్యతిరేక' విధానాలు అనుసరిస్తోందని చతుర్వేది ఆరోపించారు. ఐదేళ్ల భాజపా ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపాదించిన కనీస ఆదాయ హామీ పథకాన్ని(న్యాయ్) భాజపా అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు.
మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద కార్మికుల వేతనాలను కేవలంఏటా 2.16 శాతం మాత్రమే పెంచిందని చతుర్వేది విమర్శించారు. ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కార్మికులకు వార్షిక వేతన పెంపును మోదీ ప్రభుత్వం చేపట్టలేదని దుయ్యబట్టారు. కర్ణాటక, కేరళ, పశ్చిమ బంగాల్ రాష్ట్రాలకు కనీసం నిధులు కేటాయించలేదని ఆమె ఆరోపించారు.
భాజపా పాలిత రాష్ట్రాల్లో 'ఉపాధి హామీ పథకం' కింద కార్మికుల రోజు వారి వేతనాల పెంపు ఏటారూ.1 నుంచి రూ.5 మధ్యే ఉందని చతుర్వేది తెలిపారు. అదే సమయంలో కాంగ్రెస్ పాలిత మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కేవలం రూ.2 మాత్రమే పెరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మోదీ అధికారంలోకి వచ్చాక తన వాగ్దానాలను మరిచిపోయి, కేవలం తమ అనుయాయులు, సంపన్నుల అభివృద్ధికి మాత్రమే తోడ్పడ్డారని చతుర్వేది విమర్శించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థనుమోదీ నాశనం చేశారని, ఫలితంగా రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని ఆమె దుయ్యబట్టారు.
ఇదీ చూడండి :భారత్ భేరి: రాజకీయ తెరపై తారాతోరణం