2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పూర్తిగా డీలా పడిపోయిన కాంగ్రెస్ పార్టీకి... మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికల ఫలితాలు కొత్త శక్తినిచ్చాయి. రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ గణనీయంగా పుంజుకోవడం.. అటు అధిష్ఠానం.. ఇటు కార్యకర్తల్లోనూ నూతన ఉత్సాహం నింపింది. అదే జోరును కొనసాగిస్తూ.. అధికార భాజపాను ఇరుకున పెట్టేందుకు హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది.
ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం వంటి ప్రధాన సమస్యలను ఎత్తిచూపుతూ.. విపక్ష పార్టీలన్నింటితో కలిసి భాజపాపై ఉమ్మడి పోరు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనాయకులు.. విపక్ష పార్టీల నేతలతో ఈ మేరకు చర్చించినట్లు సమాచారం.