నరేంద్రమోదీ, ప్రధానమంత్రి సార్వత్రిక ఎన్నికల్లో భాజపానే విజయం సాధిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. 5 దశల పోలింగ్ సరళిని గమినిస్తే ఈ విషయం బోధపడుతుందన్నారు. హరియాణాలోని ఫతేబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ... మహాకూటమిపై విమర్శలు ఎక్కుపెట్టారు.
"దేశంలో ఐదు దశల పోలింగ్ అయిపోయింది. పరిస్థితి ఏంటో అందరికీ అర్థమైంది. మీ ఆశీర్వాదంతో మే 23న మళ్లీ మోదీ ప్రభుత్వమే వస్తోంది. కాంగ్రెస్, మహాకుమ్మక్కు మిత్రపక్షాలు ఇప్పటికే చేతులెత్తేశాయి. దిల్లీలో కిచిడీ సర్కార్ ఏర్పాటు చేయాలన్న వారి ఆశలపై ప్రజలు నీళ్లు చల్లారు. "
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు మోదీ. మరోసారి అవకాశమిస్తే రైతులను దోచుకున్న వ్యక్తులకు జైలు శిక్షపడేలా కృషి చేస్తానన్నారు.
"మీ ఆశీర్వాదంతోనే రైతులను దోచుకున్నవారిని ఈ కాపలదారుడు కోర్టుకు ఈడ్చాడు. బెయిల్ కోసం తిరుగుతున్నారు. ఈడీ వారి చుట్టూ తిరుగుతోంది. వాళ్లు రాజులని వాళ్ల భావన. వాళ్లనేం చేయలేమని వారి నమ్మకం. ఇప్పుడేమైంది? వాళ్లిప్పుడు భయపడుతున్నారు. ఇప్పటివరకు జైలు ద్వారం వరకు తీసుకెళ్లాను. మళ్లీ ఆశీర్వదిస్తే ఐదేళ్లలో కటకటాలపాలు చేస్తాను. "
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఇదీ చూడండి: 'ఆదరణీయ నేతల్లో మోదీకి రెండో స్థానం'