భారత్-చైనా సరిహద్దులో గత ఆరు నెలల్లో ఎలాంటి చొరబాట్లు జరగలేదన్న కేంద్రం ప్రకటనపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. జూన్ 15న గల్వాన్ లోయ హింసాత్మక ఘటనలో వీరమరణం పొందిన జవాన్లను.. తన ప్రకటనతో కేంద్రం అవమానించిందని ఆరోపించింది.
ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రస్తావించారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం.. భారత్ జవాన్లకు మద్దతిస్తుందా? లేదా? అనే విషయంపై స్పష్టతనివ్వాలని కోరారు.
"జరిగిన పరిణామాలను అర్థం చేసుకుందాం. ఎవరూ సరిహద్దును దాటలేదని ప్రధాని మోదీ ప్రకటించారు. అది చెప్పి.. చైనాలోని ఓ బడా బ్యాంకు నుంచి భారీ స్థాయిలో రుణాలు తీసుకున్నారు. ఆ తర్వాత.. రక్షణమంత్రి వచ్చి.. మన భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని ప్రకటించారు. ఇప్పుడేమో.. అసలు చొరబాట్లే జరగలేదని కేంద్ర హోంశాఖ అంటోంది. అసలు మోదీ ప్రభుత్వం ఎవరివైపు ఉంది? భారత జవాన్లవైపు ఉందా లేక చైనా వైపు ఉందా? మోదీజీ మీరు ఎందుకింత భయపడుతున్నారు."
--- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత.