తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గల్వాన్​'పై భాజపా, కాంగ్రెస్ మాటల యుద్ధం

చైనాతో నెలకొన్న ఉద్రిక్తతలపై దేశంలో రాజకీయ దుమారం తీవ్రమవుతోంది. సరిహద్దు ప్రతిష్టంభనపై అధికార భాజపా, కాంగ్రెస్ పరస్పరం నిందించుకుంటున్నాయి. తాజాగా మోదీ ప్రభుత్వంపై మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మన్మోహన్​ ఆరోపణలకు భాజపా కూడా దీటుగా స్పందించింది.

SINOINDIA-CONG-BJP
భాజపా, కాంగ్రెస్ మాటల యుద్ధం

By

Published : Jun 22, 2020, 7:33 PM IST

చైనాతో సరిహద్దు వివాదంపై అధికార భాజపా, కాంగ్రెస్​ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చైనాతో రాజీ పడకూడదని, అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ ప్రకటనతో తలెత్తే సమస్యలను దృష్టిలో ఉంచుకోవాలని మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ సునిశిత విమర్శలు చేయగా... కమలదళం తీవ్రంగా స్పందించింది.

మన్మోహన్​ తీవ్ర స్వరం..

తూర్పు లద్దాఖ్‌లో చైనాతో వివాదానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు మన్మోహన్​ సింగ్. చైనా తాను తప్పు చేయలేదని చాటుకోవడానికి అవకాశం ఇవ్వరాదని హితవు పలికారు.

"చైనాతో ఏర్పడ్డ సమస్య మరింత ముదరకుండా ప్రభుత్వంలోని అన్ని విభాగాలు పని చేయాలి. వివాదంపై సమాచారం బయటపెట్టాలి. సమాచారాన్ని దాచి ఉంచడం దౌత్య నీతికి, సమర్థ నాయకత్వానికి ప్రత్యామ్నాయం కాదు. ఈ విషయంలో వెనక్కు తగ్గితే ప్రజల విశ్వాసాలకు చారిత్రక ద్రోహం చేసినవారవుతారు. ఈ కీలక సమయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతోనే భవిష్యత్తు తరాలు మనల్ని గుర్తిస్తాయి. చైనా ఆక్రమణకు సంబంధించి ప్రకటనపై పర్యవసనాలను దృష్టిలో పెట్టుకోవాలి. దీన్ని చైనా అవకాశంగా మలుచుకుంటుంది."

- మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని

నడ్డా కౌంటర్​..

మన్మోహన్ విమర్శలపై భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ చేస్తోన్న విమర్శలు, మన్మోహన్​ చెబుతున్నదానికి పొంతన లేదని, ఇలాంటి వారిని నమ్మకూడదని అన్నారు. సైనికులను అగౌరవపరిచే వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు.

"చైనాకు 43వేల కిలోమీటర్ల భారత భూభాగాన్ని అప్పగించిన పార్టీకి చెందినవారు మన్మోహన్​. సరిహద్దులో ఎన్ని పరిణామాలు జరిగినా.. కనీసం ప్రతిఘటించకుండానే యూపీఏ ప్రభుత్వం చాలా సార్లు లొంగిపోయింది. ప్రధాని మోదీని భారతీయులు పూర్తిగా విశ్వసిస్తున్నారు. ఇప్పటివరకు మోదీ తీసుకున్న నిర్ణయాలతో దేశ రక్షణకు ఆయన ఇచ్చే ప్రాధాన్యాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు."

- జేపీ నడ్డా, భాజపా అధ్యక్షుడు

కాంగ్రెస్​ ప్రతిదాడి..

మన్మోహన్​పై నడ్డా విమర్శలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా స్పందించారు. జాతీయ భద్రతపై రాజీ పడటం మానుకోవాలని భాజపాను డిమాండ్ చేశారు.

"జేపీ నడ్డా, భాజపా.. జాతీయ భద్రత, భారత ప్రాదేశిక సమగ్రతపై రాజీ పడటం మానుకోవాలి. ఇది మన సాయుధ బలగాలు, 20 మంది సైనికుల ప్రాణ త్యాగాలకు తీరని అన్యాయం చేసినట్లే. వెనక్కు తగ్గకండి. ఈ సందర్భంలో మరింత బలంగా ముందుకెళ్లండి. ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా మా మద్దతు ఉంటుంది.

మోదీ ప్రభుత్వాన్ని ఈ ప్రశ్నలు అడిగే ధైర్యముందా?

1.2015 నుంచి 2,264 సార్లు చైనా చొరబాట్లు జరిగాయి.

2. కశ్మీర్​లో 471 మంది జవాన్లు, 253 మంది పౌరులు మరణించారు. 30 ఏళ్లలో ఇదే అత్యధికం.

3. 2019లో 3,289 సార్లు పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. 16 ఏళ్లలో ఇదే గరిష్ఠం."

- రణ్​దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

మోదీకి చైనా ప్రశంసలా?

ప్రధాని మోదీకి మన్మోహన్ సింగ్ ముఖ్యమైన సలహా ఇచ్చారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ అన్నారు. దేశ ప్రయోజనాల కోసం మర్యాదపూర్వకంగా చేసిన సూచనలను మోదీ అనుసరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

అయితే అఖిలపక్ష భేటీలో మోదీ చేసిన ప్రకటనపై చైనా ఎందుకు ప్రశంసిస్తోందని ప్రశ్నించారు రాహుల్.

"చైనా మన సైనికులను చంపింది. మన భూభాగాన్ని ఆక్రమించింది. ఈ వివాద సమయంలో అదే చైనా మోదీని ఎందుకు ప్రశంసిస్తోంది?"

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుంచి కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. తూర్పు లద్ధాఖ్​లో జరుగుతోన్న విషయాలను బయటపెట్టాలని డిమాండ్​ చేస్తోంది. గల్వాన్​ లోయలో జూన్​ 15న జరిగిన ఘర్షణలో 20 మంది సైనికులు మరణించిన తర్వాత మరింత తీవ్రంగా విమర్శలు చేస్తోంది కాంగ్రెస్​. భాజపా కూడా గతంలో చైనాతో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ ప్రతి దాడికి దిగుతోంది.

ఇదీ చూడండి:'చైనా దుశ్చర్యల పట్ల మన్మోహన్ ప్రేక్షక పాత్ర'

ABOUT THE AUTHOR

...view details