పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడం వల్ల ఈశాన్య దిల్లీలో జనజీవనం స్తంభించిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన వారు పుట్టకొకరు, చెట్టుకొకరు చొప్పును అవుతున్నారు. బయటకు వెళ్లినవారు ఇళ్లకు వస్తారన్న నమ్మకం లేదు. ఇలానే మూడు రోజులు క్రితం పాఠశాలకు వెళ్లిన ఓ విద్యార్థిని అదృశ్యమైంది.
ఎనిమిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలిక సోమవారం పరీక్ష రాయడానికి ఖజూరి ఖాస్ ప్రాంతంలోని పాఠశాలకు వెళ్లింది. ప్రతి రోజు ఆమెను ఇంటికి తీసుకొచ్చే తండ్రి తమ పరిసరాల్లో జరుగుతున్న అల్లర్లలో చిక్కుకొని సాయంత్రం వెళ్లలేకపోయారు. ఈ క్రమంలో సాయంత్రం అమె ఇంటికి రాలేదు. సోనియా విహార్ శివారులో ఉండే ఈ బాలిక 4.5 కిలో మీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలో చదువుతోంది.
" రోజు నా కుమార్తెను సాయంత్రం 5.20గంటలకు పాఠశాలకు వెళ్లి ఇంటికి తీసుకొస్తుంటా. కానీ సోమవారం మా పరిసరాల్లో ఆందోళనలు మిన్నంటడం వల్ల పాఠశాలకు చేరుకోలేకపోయా. తర్వాత నా కూతురు ఇంటికి రాలేదు. "
- బాలిక తండ్రి
బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. త్వరలో బాలికను గుర్తిస్తామని పేర్కొన్నారు.