తెలంగాణ

telangana

ETV Bharat / bharat

8 రోజుల్లో 5 కీలక తీర్పులు ఇవ్వనున్న జస్టిస్​ గొగొయి!

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగొయి వచ్చే నెల 17న పదవీ విరమణ చేయనున్నారు. సీజేఐగా మరో ఎనిమిది పని దినాలే బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ తరుణంలో రాజకీయం, రక్షణ, మతానికి సంబంధించిన ఐదు కీలక కేసుల్లో జస్టిస్​ గొగొయి తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి.

8 రోజుల్లో 5 కీలక తీర్పులు ఇవ్వనున్న జస్టిస్​ గొగొయి!

By

Published : Oct 29, 2019, 7:34 PM IST

స్వలింగ సంపర్కం నేరం కాదు.. ఆధార్​ రాజ్యాంగబద్ధమే.. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం.. భారత 45వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ దీపక్​ మిశ్రా వెలువరించిన సంచలన తీర్పులు. వీటితో పాటు మరెన్నో సున్నితమైన వ్యాజ్యాలపై తీర్పునిచ్చారు న్యాయమూర్తి జస్టిస్​ దీపక్​ మిశ్రా. అయితే వాటిలో చాలా వరకు పదవీ విరమణ చేయడానికి కొద్దిరోజుల ముందు వెలువరించినవే.

జస్టిస్ మిశ్రా వారసుడిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్​ రంజన్​ గొగొయి అదే దారిలో వెళ్లనున్నారా? మరో 18 రోజుల్లో పదవీ విరమణ చేయనున్న ఆయన.. రాజకీయం, రక్షణ, మతానికి సంబంధించిన పలు కీలక కేసుల్లో తుది తీర్పును వెల్లడించి జస్టిస్​ మిశ్రా తరహాలోనే సంచలనం సృష్టించనున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ తరుణంలో ఆయన ముందున్న సున్నితమైన ప్రధాన కేసులేంటో చూద్దాం..

కీలకమైన అయోధ్య కేసు

జస్టిస్​ రంజన్​ గొగొయి ముందున్న ప్రధాన కేసు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అయోధ్య వివాదం. ఇటీవలే 40 రోజుల పాటు రోజువారీ విచారణలు ముగిసిన నేపథ్యంలో.. ఈ కేసులో కీలకమైన తీర్పు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఉత్తర్​ప్రదేశ్​ అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిపై తమదంటే తమదే హక్కు అని సుప్రీంకోర్టులో ఇరువర్గాలు వాదోపవాదనలు వినిపించాయి. ఎంతో సున్నితమైన ఈ కేసులో సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం నవంబర్​ 17 లోపు తీర్పు వెలువరిస్తుందని అందరూ భావిస్తున్నారు.

సంచలన శబరిమల కేసు

2018 సెప్టెంబరులో శబరిమలకు సంబంధించి కీలక తీర్పును వెలువరించింది సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం. అయ్యప్ప ఆలయంలో అనాదిగా ఉన్న మహిళల ప్రవేశ నిషేధాన్ని తొలగించి.. 10 నుంచి 50 ఏళ్లలోపు వారికి ప్రవేశం కల్పిస్తూ.. సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే శబరిమల అంశంపై సుప్రీం జోక్యాన్ని సవాలు చేస్తూ.. దాదాపు 65 పిటిషన్లు అత్యున్నత న్యాయస్థానంలో దాఖలయ్యాయి. ఈ సున్నితమైన అంశంపైనా జస్టిస్ రంజన్​ గొగొయి తుది తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి.

రఫేల్ కేసు

ఫ్రాన్స్​కు చెందిన డసో ఏవియేషన్​ సంస్థ నుంచి కొనుగోలు చేస్తున్న 36 రఫేల్​ యుద్ధ విమానాల ఒప్పందంలో భారీ అక్రమాలు జరిగాయని సీనియర్​ న్యాయవాది​ ప్రశాంత్​ భూషణ్​, మాజీ కేంద్ర మంత్రులు అరుణ్​ శౌరి, యశ్వంత్​ సిన్హా దాఖలు చేసిన పిటిషన్​పై ఈ ఏడాది మే 10న తీర్పును వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ దావాలపై వాదోపవాదనలు విన్న అనంతరం జస్టిస్ రంజన్​ గొగొయి తుది తీర్పు వెలువరించనున్నారు.

రాహుల్ కోర్టు ధిక్కరణ కేసు

'కాపలాదారే దొంగ' అని రఫేల్​ తీర్పులో సుప్రీంకోర్టే చెప్పిందని గతంలో రాహుల్​ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భాజపా నేత మీనాక్షి లేఖి కోర్టు ధిక్కరణ పిటిషన్​ వేశారు. కోర్టు సైతం వ్యాఖ్యలను తప్పుగా ఆపాదించారని అభిప్రాయపడుతూ రాహుల్​గాంధీ బేషరతు క్షమాపణలు చెప్పాలని గతంలో నోటీసులిచ్చింది. సుప్రీంకోర్టుకు బేషరతు క్షమాపణ చెబుతూ ప్రమాణపత్రం దాఖలు చేసిన రాహుల్​.. కోర్టు ధిక్కరణ పిటిషన్​ను కొట్టివేయాలని కోరారు. ఈ కేసుపైనా సీజేఐ నేతృత్వంలోని అత్యున్నత న్యాయస్థానం​ తీర్పు ఇచ్చే అవకాశాలున్నాయి.

2017 మనీ బిల్లు చెల్లుబాటు

2017లో అప్పటి ఆర్థికమంత్రి అరుణ్​జైట్లీ.. ఆర్థిక బిల్లును మనీ బిల్లుగా పార్లమెంట్​లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ఉభయసభలు పచ్చజెండా ఊపాయి. అయితే ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ.. సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపైనా అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వనుంది.

ఎనిమిది రోజులే

ప్రస్తుతం సుప్రీంకోర్టు దీపావళి సెలవుల్లో ఉంది. నవంబర్​ 4న తిరిగి తెరుచుకోనుంది. ఆ తర్వాత 11, 12 తేదీలు సెలువులు కాగా... జస్టిస్​ రంజన్​ గొగొయ్ నవంబర్​ 17న పదవీ విరమణ చేయనున్నారు. ఈ తరుణంలో ఆయనకు ఎనిమిది పని దినాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

ఇదీ చూడండి : రఫేల్​, రాహుల్​ కేసులపై విచారణ వాయిదా

ABOUT THE AUTHOR

...view details