గల్వాన్ భూభాగంపై ప్రాదేశిక హక్కులు తమవేనంటూ చైనా చేస్తున్న వాదనలు కొత్తేం కావని ప్రముఖ వ్యూహ నిపుణులు ప్రొఫెసర్ ఎం టేలర్ ఫ్రావెల్ పేర్కొన్నారు. చైనా ప్రభుత్వం నుంచి సేకరించిన భౌగోళిక పటాల ఆధారంగా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నట్లు తెలిపారు. తూర్పు వైపు లేదా నది మలుపు వరకు భూభాగం తమదేనని బీజింగ్ వాదిస్తోందని స్పష్టం చేశారు. ప్రస్తుత సైనిక సంక్షోభ సమయంలోనూ ఇదే వాదన ముందుకు తీసుకొచ్చిందని అన్నారు. అయితే గతంతో పోలిస్తే ఈ ప్రాంతంలో చైనా కార్యకలాపాలు పెరిగినట్లు వెల్లడించారు.
'ఈటీవీ భారత్' ముఖాముఖిలో పాల్గొన్న ఆయన వాస్తవాధీన రేఖ వద్ద భారత్- చైనా ఉద్రిక్తతలపై పలు కీలక విషయాలు వెల్లడించారు. సరిహద్దులో యథాతథ స్థితిని తిరిగి నెలకొల్పడం దాదాపు అసాధ్యమని అభిప్రాయపడ్డారు. యథాతథ స్థితికి రావాలంటే ముందుగా సైనికులు ఏయే ప్రాంతాల్లో ఉన్నారనే విషయంపై ఏకాభిప్రాయానికి రావాలన్నారు. ఇది చాలా కష్టతరమైన విషయమని తెలిపారు.
అమెరికా-రష్యా సాయం చేస్తాయా!
చైనా దూకుడు నేపథ్యంలో అమెరికా సైన్యాన్ని ఆసియా దేశాల్లో మోహరిస్తామన్న ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వ్యాఖ్యలపై స్పందించారు టేలర్. భారత్కు మద్దతుగా అమెరికా ఏ మేరకు సహాయం చేస్తుందనేది కచ్చితంగా చెప్పలేమన్నారు. ఒకవేళ అమెరికా సాయం భారత్ కోరుకుంటే.. అగ్రరాజ్యంతో మరింత సన్నిహితంగా మెలగాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.