భారత్-చైనా మధ్య ఉన్న భేదాభిప్రాయాలు.. ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపకూడదని జాగ్రత్త వహించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు భారత్లోని చైనా రాయబారి సన్ వైడాంగ్. ఇరు దేశాలు పరస్పర విశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. వాస్తవాధీన రేఖ వెంబడి భారత్-చైనా సైనికుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో వైడాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇరు దేశాల మధ్య ఉన్న భేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని వైడాంగ్ సూచించారు. ఒకరినొకరు ఏ విధంగా కూడా హాని పరుచుకోకూడదన్న ప్రాథమిక నియమానికి ఇరుదేశాలు కట్టుబడి ఉండాలన్నారు.
"మన మధ్య ఉన్న భేదాభిప్రాయాలను సరైన రీతిలో అర్థం చేసుకోవాలి. ఆ ప్రభావం మన ద్వైపాక్షిక సంబంధాలపై పడకూడదు. అదే సమయంలో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి. చైనా-భారత్ ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. తన అభివృద్ధితో పాటు భారత్కు వృద్ధి చెందాలని చైనా కోరుకుంటోంది. తమ లక్ష్యాలను ఛేదించడానికి ఇరు దేశాలు సహకరించుకోవాలి."