చైనా పక్కా ప్రణాళికతోనే లద్దాఖ్ సరిహద్దులో దుస్సాహసానికి పాాల్పడిందని అభిప్రాయపడ్డారు రక్షణ రంగ నిపుణులు విక్రమ్ జిత్ సింగ్. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈటీవీ భారత్‌తో ఈ విషయంపై ప్రత్యేకంగా మాట్లాడారు. దక్షిణాసియా పట్ల చైనా దృష్టి మారిందని, ప్రత్యర్థిలా కాకుండా భారత్‌ను శత్రువులా చూస్తోందన్నారు.
భౌగోళిక వ్యూహాత్మక దృష్టిని చైనా మార్చుకుంటోందని, అందుకే ముందస్తు వ్యూహ రచనతోనే తూర్పు లద్ధాఖ్‌లో దురాగతాలకు పాల్పడుతోందని సింగ్ వివరించారు. భారత సైనికులతో ఘర్షణకు దిగడానికి ముందు తమ దేశ ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడకుండా చైనా తెలివిగా వ్యవహరించిందని పేర్కొన్నారు. చైనా ఉద్దేశాన్ని భారత్ వ్యూహాత్మకంగా సరిగ్గా అంచనా వేయలేకపోయిందని, సైనిక-రాజకీయ నాయకత్వం అర్థం చేసుకోలేకపోయిందని సింగ్ విశ్లేషించారు.
భారత భౌగోళిక-వ్యూహాత్మక, రాజకీయ-వ్యూహాత్మక మార్పులే చైనా భౌగోళిక-వ్యూహాత్మక దృష్టిని మార్చుకునేలా చేశాయని సింగ్ తెలిపారు. సరిహద్దు వివాదంపై చైనా ఆలోచన పూర్తిగా మారిందని.. చర్చలు జరిపేందుకు, బలగాలను ఉపసంహరించుకునే విషయంలో వారు వెనక్కి తగ్గే అవకాశాలే కన్పించడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో చొరబాట్లు జరిగినప్పుడు చర్చల అనంతరం కార్యకలాపాలను చైనా ఉపసంహరించుకుందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని, భారీగా బలగాలను మోహరించిందని సింగ్ స్పష్టం చేశారు.