తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సర్కారు మధ్యాహ్న భోజనంలో ఉప్పు,రోటీనే!

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మధ్యాహ్న భోజన పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. కానీ కొన్ని ప్రాంతాల్లో పోషకాహారం కాదు కదా కనీస భోజనం కూడా అందట్లేదు. మధ్యాహ్న భోజనం పేరుతో కేవలం రొట్టెలు, కూరకు బదులుగా ఉప్పు వేసి ఇస్తున్నారు. ఈ దారుణమైన ఘటన ఉత్తర్​ప్రదేశ్​ మీర్జాపుర్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

By

Published : Aug 23, 2019, 12:46 PM IST

Updated : Sep 27, 2019, 11:40 PM IST

మధ్యాహ్న భోజనంలో ఉప్పు.. రోటీనే!

ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు అందించే మధ్యాహ్న భోజనంలో అన్నం, పప్పు, రొట్టె, కూరగాయాలు, పండ్లు, పాలు వంటి పోషకాహారం ఇవ్వాలని అధికారులు ఈ పథకం తీసుకొచ్చారు. ఉత్తర్​ప్రదేశ్​ మీర్జాపుర్‌లోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇవేవీ ఇవ్వకుండా రొట్టెలు మాత్రమే పెడుతున్నారు. కనీసం కూర కూడా వండకుండా ఉప్పుతో తినమంటున్నారు. ఒకరోజు ఉప్పు, రొట్టెలు.. మరుసటి రోజు అన్నం, ఉప్పు ఇలా వారమంతా ఇదే భోజనం అందిస్తున్నారు.

ఇలా వెలుగులోకి...

ఓ జాతీయ వార్తా సంస్థ కథనంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది కాలంగా ఈ స్కూల్లో పిల్లలకు ఇదే భోజనం పెడుతున్నారు. పాలు అరుదుగా వస్తుంటాయి. వచ్చినా వాటిని పిల్లలకు ఇవ్వరు. ఇక అరటిపండ్లు ఇంతవరకూ పంచలేదని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు.
ఈ వ్యవహారం బయటకు రావటం వల్ల అధికారులు విచారణ చేపట్టారు. గ్రామ పంచాయతీ సూపర్‌వైజర్‌, స్కూల్‌ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతారహితంగా ప్రవర్తించినట్లు తేలింది. వారిని విధుల నుంచి సస్పెండ్‌ చేశామని అధికారులు వెల్లడించారు. ఉప్పుతో రొట్టెలు తింటున్న చిన్నారుల వీడియోను రాష్ట్రీయ జనతా దళ్‌ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేసింది.

బెంగాల్​లోనూ..

ఇటీవల పశ్చిమ బంగలోని చిన్సురాలోని ఓ బాలికల పాఠశాలలోనూ చిన్నారులకు ఉప్పు, అన్నం మాత్రమే పెడుతున్న వీడియో వైరల్‌ అయ్యింది. ఇద్దరు టీచర్లను సస్పెండ్‌ చేశారు అధికారులు.

ఇదీ చూడండి: 2వేల మంది రాజ్​పుత్​ వనితల 'తల్వార్​ రాస్​'

Last Updated : Sep 27, 2019, 11:40 PM IST

ABOUT THE AUTHOR

...view details