తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లైవ్​:కోర్టు నుంచి కస్టడీలోకి తీసుకున్న సీబీఐ - ed

చిదంబరం

By

Published : Aug 22, 2019, 4:00 PM IST

Updated : Sep 27, 2019, 9:28 PM IST

19:19 August 22

సోమవారం వరకు సీబీఐ కస్టడీలో చిదంబరం

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి చుక్కెదురు అయింది. చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకోనేందుకు అనుమతి ఇవ్వాలన్న సీబీఐ అభ్యర్థనకు కోర్టు అంగీకారం తెలిపింది. తీర్పును అనుసరించి కోర్టు నుంచి చిదంబరాన్ని  తమ అదుపులోకి తీసుకుంది సీబీఐ.

కేసు విచారణలో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆయన్ను 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ విజ్ఞప్తి చేసింది. ఈనెల 26 వరకు కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమయంలో చిదంబరంను కుటుంబసభ్యులు, న్యాయవాదులు రోజూ 30 నిమిషాల పాటు కలిసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

19:01 August 22

ఇంద్రాణీ వాంగ్మూలంతోనే చిదంబరానికి చిక్కులు

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం అరెస్టు వ్యవహారం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఐఎన్​ఎక్స్​ కేసుకు సంబంధించి ఆయన ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారుల బృందం గంటపాటు జరిగిన హైడ్రామా తరువాత నిన్న రాత్రి 10 గంటల సమయంలో అరెస్టు చేసింది.

ఈ రోజు చిదంబరంను పలు దఫాలుగా విచారించిన తర్వాత ఈ రోజు  మధ్యాహ్నం సీబీఐ కోర్టులో అధికారులు హాజరు పరిచారు. 5 రోజుల పాటు చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

'కార్తీకి సాయం చేయాలన్నారు'

చిదంబరాన్ని అరెస్టు చేసేందుకు ఐఎన్‌ఎక్స్‌ మీడియా సంస్థ యజమాని ఇంద్రాణీ ముఖర్జీ గతేడాది ఫిబ్రవరి 17న ఇచ్చిన వాంగ్మూలమే ప్రధాన ఆధారమైంది. 2006లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో దిల్లీ నార్త్‌బ్లాక్‌ కార్యాలయంలో కలిశామన్నారు. ఆ సమయంలో ఆయన తన కుమారుడు కార్తీని తమకు పరిచయం చేశాడని వెల్లడించారు. కార్తీ వ్యాపారాలకు ఐఎన్‌ఎక్స్‌ మీడియా ద్వారా సాయం చేయాలని తనను, తన భర్త పీటర్‌ ముఖర్జీని కోరారని ఆమె పేర్కొన్నారు.

'లంచం డిమాండ్​'

ఈ వాంగ్మూలమే చిదంబరంపై సీబీఐ, ఈడీల విచారణకు కీలక ఆధారమైంది. దిల్లీలోని ప్రముఖ హోటల్‌లో కార్తీ తమను క్విడ్‌ ప్రోకో కింద 1 మిలియన్‌ డాలర్ల లంచం డిమాండ్‌ చేశారని ఆమె తన వాంగ్మూలంలో తెలిపారు.

కార్తీ చిదంబరానికి చెందిన అడ్వాంటేజ్‌ స్ట్రాటజిక్‌ కన్సల్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏఎస్‌సీపీఎల్‌) కంపెనీతో కలిసి పనిచేసిన సందర్భంలోనే రూ.305 కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌బీఐ) అందుకోవడానికి ఐఎన్‌ఎక్స్‌ మీడియా’కు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపీబీ) పచ్చజెండా ఊపింది.

చక్రం తిప్పిన చిదంబరం!

ఈ వ్యవహారంలో నగదు అందుకున్న కంపెనీలన్నీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చిదంబరం కుమారుడు కార్తీ నియంత్రణలో ఉన్నాయన్నది సీబీఐ, ఈడీల ఆరోపణ. విదేశీ పెట్టుబడుల విషయంలో ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ మాత్రమే ఆమోదం తెలపాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించి ఎఫ్‌ఐపీబీ ద్వారా సమ్మతి వచ్చేలా చిదంబరం చక్రం తిప్పారనేది ప్రధాన అభియోగం. ఈ కేసులోనే చిదంబరాన్ని అనేకసార్లు దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు.

రూ.3500 కోట్ల ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ ఒప్పందం కేసులోనూ చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఐఎన్‌ఎక్స్‌ కేసు వ్యవహారంలో కార్తీ చిదంబరం కూడా గతేడాది ఫిబ్రవరిలో అరెస్టయ్యారు.  ప్రస్తుతం బెయిల్​ మీదనే ఉన్నారు కార్తీ.

18:49 August 22

కస్టడీలోకి తీసుకున్న సీబీఐ

  • కోర్టు నుంచి కస్టడీలోకి తీసుకున్న సీబీఐ అధికారులు
  • సోమవారం వరకు సీబీఐ కస్టడీలో చిదంబరం
  • ​రోజూ 30 నిమిషాల పాటు కుటుంబాన్ని కలిసే అవకాశమిచ్చిన కోర్టు

18:41 August 22

5 రోజుల సీబీఐ కస్టడీకి కోర్టు అంగీకారం

  • సీబీఐ ప్రత్యేక కోర్టులో చిదంబరానికి చుక్కెదురు
  • చిదంబరంను సీబీఐ కస్టడీకి అప్పగించేందుకు ప్రత్యేక కోర్టు అంగీకారం
  • నేటి నుంచి ఆగస్టు 26 వరకు సీబీఐ అదుపులో చిదంబరం

17:03 August 22

తీర్పును 30 నిమిషాలు వాయిదా వేసిన కోర్టు

  • తన కేసును తనే వాదించుకుంటాన్న చిదంబరం
  • అడ్డుచెప్పిన సొలిసిటర్​ జనరల్​ తుషార్ మెహతా
  • నిందితుడు తరఫున ఇద్దరు న్యాయవాదులు ఉన్నారని మెహతా గుర్తు చేశారు
  • చిదంబరం కస్టడీపై తీర్పును 30 నిమిషాలు వాయిదా వేసిన కోర్టు

16:41 August 22

ఎలాంటి ఆధారాలు లేకుండా కస్టడీనా? సింఘ్వీ

  • చిదంబరం తరఫున మరో న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్​ మను సింఘ్వీ వాదనలు ప్రారంభించారు.
  • ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో మొత్తం ఇంద్రాణీ ముఖర్జీ వాంగ్మూలంపైనే ఆధారపడి ఉంది.
  • చిదంబరానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకుండా కస్టడీకి ఎలా తీసుకుంటారు? సింఘ్వీ
  • సహకారం ఇవ్వకపోవటం అంటే ఏమిటో సీబీఐ చెప్పాలి: సింఘ్వీ
  • ఒక్కసారి పిలిచారు.. చిదంబరం హాజరయ్యారు. ఇందులో సహకారం ఇవ్వకపోవటం ఏమిటి? సింఘ్వీ
  • వాళ్లు కోరుకున్న సమాధానం ఇవ్వకపోతే సహకరించనట్లా? సింఘ్వీ

16:30 August 22

చిదంబరం తరఫున వాదనలు ముగించిన కపిల్ సిబల్

  • అరెస్టు చేయకుండా గతంలోనే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపిన కపిల్ సిబల్
  • ప్రధాన నిందితులైన పీటర్, ఇంద్రాణి ముఖర్జీ బెయిల్‌పై ఉన్నారని తెలిపిన సిబల్
  • కార్తీ చిదంబరం, భాస్కర్ బెయిల్‌పై ఉన్నారని తెలిపిన కపిల్‌ సిబల్‌
  • ఎఫ్‌ఐపీబీలోని ఆరుగురు కార్యదర్శుల్లో ఒకరు గవర్నర్ అయ్యారని తెలిపిన సిబల్
  • ఏ ఒక్క కార్యదర్శిని కూడా ఇప్పటివరకు ప్రశ్నించలేదన్న కపిల్ సిబల్
  • రాత్రి 8 గం.కు అరెస్టు చేసి ఈ ఉదయం 11 వరకు ఎలాంటి విచారణ జరపలేదు: సిబల్‌
  • ఉదయం 11 గంటల నుంచి 12 ప్రశ్నలు సంధించారని తెలిపిన కపిల్‌ సిబల్‌
  • 12 ప్రశ్నల్లో 6 ప్రశ్నలకు గతంలోనే సమాధానం ఇచ్చారు: సిబల్‌
  • ఇప్పుడు కూడా చిదంబరం అదే సమాచారం ఇచ్చారు: కపిల్‌ సిబల్‌
  • ఒకవేళ ముడుపులు తీసుకుని ఉంటే ఎక్కడో ఒకచోటకు పంపాలి కదా!: సిబల్‌
  • ఎక్కడికి పంపారో సీబీఐని చెప్పమనండి: కపిల్‌ సిబల్‌
  • ముడుపులు ఇచ్చినట్లు పేర్కొన్న ప్రధాన నిందితుల డైరీలను ఒకసారి పరిశీలించండి: సిబల్‌
  • ముడుపులు ఎంత ఉన్నాయో చెప్పమనండి: కపిల్‌ సిబల్‌
  • విదేశీ బ్యాంకు ఖాతాల వ్యవహారంలో సంబంధం లేని ప్రశ్నలు సంధించారు: సిబల్‌
  • ఇదే కోర్టులో 7 నెలలుగా విచారణ జరుగుతోంది.. ఏం తేల్చారు: సిబల్‌
  • ఎటువంటి ఆరోపణలు నిరూపించలేకపోతే అది మాతప్పు కాదు కదా?: సిబల్‌

16:12 August 22

చిదంబరం తరఫున వాదిస్తున్న కపిల్​ సిబల్​


ఈ కేసులో నిందితుడిగా ఉన్నది కార్తీ చిదంబరం అనీ, ఆయన ప్రస్తుతం బెయిల్​ మీద ఉన్నారని కోర్టుకు స్పష్టం చేశారు చిదంబరం తరఫు న్యాయవాది కపిల్​ సిబల్. మిగతా నిందితులు పీటర్​, ఇంద్రాణీ ముఖర్జీ కూడా బెయిల్​ మీదనే ఉన్నారని తెలిపారు. కేసులో దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందని, ఛార్జ్​షీట్​ ముసాయిదా కూడా సిద్ధం చేశారని చెప్పారు.

ఈ వివాదంలో ఐఎన్​ఎక్స్​ మీడియాకు విదేశీ పెట్టుబడుల బోర్డు తరఫున ఆరుగురు ప్రభుత్వ కార్యదర్శుల ఆమోదం లభించిందని గుర్తు చేశారు సిబల్. వీటన్నింటికీ లిఖితపూర్వక ఆధారాలు ఉన్నాయన్నారు. విచారణకు చిదంబరం ఎప్పుడూ గైర్హాజరు కాలేదని స్పష్టం చేశారు.

15:44 August 22

5 రోజుల కస్టడీ కోరిన సీబీఐ

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రిని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు అధికారులు. రిమాండ్ ప్రతిని న్యాయమూర్తికి అందించారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. చిదంబరాన్ని ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు.

కోర్టుకు చిదంబరం సతీమణి నళిని చిదంబరం, కార్తీ చిదంబరం హాజరయ్యారు. వీరితో పాటు కాంగ్రెస్‌ నేతలు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ వచ్చారు.

అంతకుముందు చిదంబరాన్ని సీబీఐ అధికారులు దాదాపు 3 గంటలపాటు విచారించారు. అయితే ఆయన కొన్ని ప్రశ్నలకు ముక్తసరిగా సమాధానాలు చెప్పడం లేదా మౌనం వహించారని... విచారణకు సహకరించలేదని సీబీఐ వర్గాలు వెల్లడించాయి.

Last Updated : Sep 27, 2019, 9:28 PM IST

ABOUT THE AUTHOR

...view details