చీకటి పడితే చాలు... లక్షల మైళ్ల దూరంలో కనిపిస్తూ ఊరించే జాబిల్లి గురించి కథలు చెప్పుకుంటాం. చందమామ రావే అంటూ పాటలు పాడుకుంటాం. చంద్రుడు... కథలు, పాటలకే పరిమితమా..? అక్కడకు చేరుకోలేమా..? శాశ్వత నివాసం ఏర్పరుచుకోలేమా..? ఈ ప్రశ్నలకు జవాబుల కోసం ఎప్పటినుంచో వెతుకుతోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.
2008లోనే తొలిసారి...
జాబిల్లిపైకి చేరుకునేందుకు 2008లోనే భారత్ చంద్రయాన్-1 పేరుతో ఓ ప్రాజెక్టు చేపట్టింది. చంద్రయాన్-1 ఆర్బిటార్ అక్కడి కక్ష్యలోనే తిరిగి సమాచారాన్ని సేకరించి భూమికి పంపింది. అంతరిక్ష రంగంలో భారత ముద్ర ఉండాలన్న బలమైన ఉద్దేశంతో 35 కిలోల ఇంపాక్టర్ను చంద్రుడి ఉపరితలంపైకి జారవిడవగా... అది జాబిల్లిని బలంగా ఢీకొట్టింది. ఇంపాక్టర్ బద్దలయ్యేలోపే.. చంద్రుడి చుట్టూ తిరుగుతూ ఛాయాచిత్రాలు, సమాచారాన్ని సేకరించి భూమికి చేరవేసింది. దాదాపు 3 వేల సార్లు పరిభ్రమించి.. 70 వేల వరకు ఫొటోలను పంపింది.
చిన్న చిన్న ఇబ్బందులతో 2009 ఆగస్టు 29న చంద్రయాన్-1తో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. రెండేళ్లు పనిచేసేలా రూపొందించినా 10 నెలలకే ప్రస్థానం ముగిసింది.
అయినా.. భారత అంతరిక్ష రంగంలో చంద్రయాన్-1 ఓ అద్భుతం, గొప్ప మైలురాయి, మరిచిపోలేని ఘనత. తొలిసారి.. చందమామపై నీరు, మంచు ఆనవాళ్లు ఉన్నాయని గుర్తించింది చంద్రయాన్-1.
అమెరికా పంపిన 'మూన్ మినరాలజీ మ్యాపర్' నీటి జాడను తొలిసారిగా గుర్తించినా... తదనంతరం ఇస్రో చంద్రయాన్-1 ద్వారా నిర్ధరించింది.