తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చంద్రయాన్​-2: ఆ 15 నిమిషాలు ఉత్కంఠభరితం

ఆ దృశ్యం అత్యంత భయానకం. భగ్గున మండుతున్న నిప్పుకణికలా దూసుకొచ్చే వ్యోమనౌక.. దాని వేగం గంటకు 6వేల కిలోమీటర్లు. దట్టమైన పొగలా రేగే ధూళి. ఇదంతా మన చంద్రయాన్‌-2లోని ల్యాండర్‌ విక్రమ్‌ జాబిల్లిపై కాలుమోపడానికి ముందు 15 నిమిషాల వ్యవధిలో కనిపించే దృశ్యం అంతటి మహా వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటూ విక్రమ్‌ సుతిమెత్తగా చంద్రుడిపై దిగుతుంది.

చంద్రయాన్​-2: ఆ 15 నిమిషాలు ఉత్కంఠభరితం

By

Published : Sep 6, 2019, 10:08 AM IST

Updated : Sep 29, 2019, 3:10 PM IST

చంద్రయాన్​-2లోని ల్యాండర్​ విక్రమ్​ జాబిల్లిపై కాలుపమోపడానికి ముందు 15 నిమిషాల వ్యవధిలో కనిపించే దృశ్యం అత్యంత ముఖ్యమైనది. 6 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే వ్యోమనౌక తన వేగాన్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ.. సుతిమెత్తగా చంద్రుడిపై దిగనుంది.

అంతా సవ్యంగా ఉందనుకున్నాక శుక్రవారం అర్ధరాత్రి దాటాక 1.40 గంటలకు చంద్రుడి కక్ష్య నుంచి కిందకు దిగే క్రమంలో ప్రధాన దశకు సంబంధించి ఇస్రో శాస్త్రవేత్తలు ‘విక్రమ్‌’ ల్యాండర్‌కు ఆదేశాలిస్తారు. ఆ సమయంలో అది జాబిల్లిపై 35×100 కిలోమీటర్ల కక్ష్యలో ఉంటుంది. దాని వేగం గంటకు 6120 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇస్రో నుంచి ఆదేశాలు రాగానే ల్యాండర్‌లోని థ్రాటుల్‌ ఏబుల్‌ ఇంజిన్లు ప్రజ్వరిల్లుతాయి. అవి ల్యాండర్‌ గమనానికి వ్యతిరేక దిశలో మండుతూ ఆ వ్యోమనౌక వేగాన్ని తగ్గిస్తాయి. ల్యాండర్‌ కిందకు దిగడం మొదలవుతుంది.

భూ కేంద్రంతో నేరుగా..

చంద్రుడిపై విక్రమ్‌ కాలుమోపే సమయానికి అక్కడ సూర్యోదయమవుతుంది. దీంతో ఈ వ్యోమనౌక తన సౌర ఫలకాల ద్వారా బ్యాటరీలను రీఛార్జి చేసుకుంటుంది. భూ కేంద్రంతో నేరుగా హై బ్యాండ్‌విడ్త్‌ లింక్‌ను ఏర్పాటు చేసుకొని సంభాషిస్తుంది. తన పరిధిలోకి వచ్చినప్పుడల్లా ఆర్బిటర్‌తోనూ కమ్యూనికేషన్‌ సాగిస్తుంది. మొదట ఇస్రో శాస్త్రవేత్తలు ల్యాండర్‌ ‘ఆరోగ్య పరిస్థితి’పై తనిఖీలు చేస్తారు. అనంతరం జాబిల్లి ఉపరితల కార్యకలాపాలు మొదలవుతాయి.

ల్యాండింగ్‌ సమయంలో పైకి లేచే జాబిల్లి ధూళి నాలుగు గంటల తర్వాత సర్దుకుంటుంది. అప్పుడు ల్యాండర్‌ నుంచి జారుడు బల్ల లాంటి ర్యాంప్‌ విచ్చుకుంటుంది. దాని మీద నుంచి ఆరు చక్రాల ‘ప్రజ్ఞాన్‌’ రోవర్‌ కిందకు దిగుతుంది. ఈ రోవర్‌ నేరుగా భూ కేంద్రంతో సంభాషించలేదు. ఆర్బిటర్‌తో మాత్రమే కమ్యూనికేషన్‌ సాగిస్తుంది. ఈ రోవర్‌పై భారత జాతీయ పతాకాన్ని, ఇస్రో లోగోను చిత్రీకరించారు.

చంద్రయాన్​-2: ఆ 15 నిమిషాలు ఉత్కంఠభరితం

దిగేది ఇక్కడే..

చంద్రుడి దక్షిణార్ధగోళంలో మాంజినస్‌ సి, సింపెలియస్‌ ఎన్‌ అనే రెండు బిలాల మధ్య ప్రాంతంలో ల్యాండర్‌ దిగుతుంది. జపాన్‌కు చెందిన కగుయా ఆర్బిటర్‌, అమెరికాకు చెందిన ఎల్‌ఆర్‌వో ఆర్బిటర్లు అందించిన చిత్రాలు, డేటాను విశ్లేషించిన ఇస్రో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసింది.

అమెరికాకు చెందిన అపోలో-16, సర్వేయర్‌-7లు మాత్రమే ఇప్పటివరకూ ఎగువ మైదాన ప్రాంతాల్లో దిగాయి. మిగతా వ్యోమనౌకలన్నీ చీకటిమయంగా ఉండే, నున్నగా ఉండే లావా మైదాన ప్రాంతాల్లో కాలుమోపాయి. చంద్రయాన్‌-2 కాలుమోపుతున్న దక్షిణ ధ్రువానికి చేరువలోని ప్రాంతంలో వ్యోమనౌకలేవీ ఇప్పటివరకూ దిగలేదు.

అంతా సొంత తెలివే!

ఒక సంకేతం భూమి మీదున్న ఇస్రో నియంత్రణ కేంద్రం నుంచి ల్యాండర్‌కు వెళ్లి, మళ్లీ భూమిని చేరడానికి దాదాపు మూడు సెకన్లు పడుతుంది. శరవేగంగా సాగిపోయే ల్యాండింగ్‌ ప్రక్రియలో అది గణనీయమైన జాప్యం కిందే లెక్క. అందువల్ల ల్యాండింగ్‌కు ఇస్రో ఇంజినీర్లు మార్గనిర్దేశం చేయడం సాధ్యం కాదు. సొంతంగానే ఈ ప్రక్రియను చేపట్టేందుకు అవసరమైన మేధస్సును విక్రమ్‌ ల్యాండర్‌కు అందించారు.

అందులోని కంప్యూటర్‌.. దూరం, త్వరణం, వేగం, దృక్కోణం వంటి అంశాలపై నిరంతరంగా వివిధ సెన్సర్ల నుంచి ఎప్పటికప్పుడు డేటాను సేకరిస్తుంది. తాను ప్రయాణించాల్సిన మార్గంపై లెక్కలు కడుతుంది. అవసరమైతే ఇంజిన్ల ప్రజ్వలనలో మార్పులు చేయడం ద్వారా మార్గాన్ని సరిచేసుకుంటుంది. జాబిల్లిపై క్షేమంగా దిగే వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మానవ నియంత్రణతో ల్యాండింగ్‌కు ప్రయత్నించడం వల్ల ఏప్రిల్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన బెరెషీట్‌ వ్యోమనౌక చంద్రుడిపై దిగే క్రమంలో కూలిపోయింది.

అద్భుతం ఈ ఇంజిన్లు

విక్రమ్‌ సాఫీగా దిగడంలో ఒక్కొక్కటి 800 న్యూటన్‌ సామర్థ్యమున్న ఐదు థ్రాటుల్‌ ఏబుల్‌ ఇంజిన్లు కీలక పాత్ర పోషిస్తాయి. సంక్లిష్టమైన ఈ యంత్రాలను భారత్‌లో తయారుచేయడం ఇదే మొదటిసారి. ఇవి సమన్వయంతో, నియంత్రిత పద్ధతిలో ప్రజ్వరిలిల్లుతూ ల్యాండర్‌ను కిందకు దించుతాయి. ల్యాండర్‌లోని నేవిగేషన్‌, గైడెన్స్‌, కంట్రోల్స్‌, చోదక, సెన్సర్లు, ఇతర సాధనాలతోనూ సమన్వయం చేసుకుంటాయి. దృక్కోణం, ఎత్తు, వేగం వంటి అంశాలపై అందే డేటా ఆధారంగా ఇవి తమ పనితీరును సర్దుబాటు చేసుకుంటాయి. నియంత్రణ కోసం 50 న్యూటన్‌ సామర్థ్యమున్న ఎనిమిది నియంత్రణ థ్రస్టర్లు ఉన్నాయి. అవసరాన్ని బట్టి వ్యోమనౌకను పైకి, కిందకి, పక్కకు అవి తరలించగలవు.

ల్యాండింగ్​ అవరోధాలపై..

కిందకు దిగే దశలో ల్యాండర్‌కు ఇనర్షియల్‌ నేవిగేషన్‌ వ్యవస్థ మార్గనిర్దేశం చేస్తుంది. ఇందులో ఏమైనా వైరుద్ధ్యాలు తలెత్తితే సరిచేయడానికి ఆప్టికల్‌ సెన్సర్లు ఉన్నాయి. ల్యాండింగ్‌ సమయంలో ఆర్బిటర్‌, ల్యాండర్‌లోని కెమెరాలు ఎప్పటికప్పుడు దృశ్యసహిత వివరాలను అందిస్తాయి. ల్యాండర్‌లో దిగువ భాగంలో ఉన్న కెమెరా.. ల్యాండింగ్‌ ప్రదేశంలో ఏమైనా అవరోధాలు ఉన్నాయా అన్నది పరిశీలిస్తుంది. అప్పటికే తనలో నిక్షిప్తం చేసిన ఫొటోలను, వాస్తవ దృశ్యాలను ల్యాండర్‌ పోల్చి చూసుకుంటుంది. వాటి ఆధారంగా తన మార్గాన్ని సరిచేసుకుంటుంది.

ల్యాండింగ్‌ సమయంలో రాకెట్‌ నుంచి వెలువడే వేడి వాయువుల వల్ల జాబిల్లి నుంచి కొంత ధూళి పైకి లేచే అవకాశం ఉంది. అయితే చంద్రుడి వద్ద పెద్దగా వాతావరణం లేకపోవడం వల్ల ల్యాండర్‌ కింది భాగంలోనే ఈ ధూళి పైకి ఎగస్తుందని భావిస్తున్నారు.
ల్యాండర్‌లోని సున్నితమైన ఎలక్ట్రానిక్‌ పరికరాలను రక్షించడానికి బంగారు వర్ణంలోని బహుళ పొరల ఇన్సులేషన్‌ పాలీమర్‌తో రక్షణ కవచం ఏర్పాటు చేశారు.

గరిష్ఠంగా సౌరశక్తి

చంద్రయాన్‌-2 ల్యాండర్‌, రోవర్‌లోని సౌరఫలకాలు.. చంద్రుడి ఉపరితలానికి 90 డిగ్రీల కోణంలో ఉండేలా ప్రత్యేకంగా అమర్చారు. ల్యాండింగ్‌ ప్రదేశ తీరుతెన్నుల దృష్ట్యా అక్కడ సూర్యుడు ఆకాశంలో 19 డిగ్రీలను మించి ఉదయించే పరిస్థితి ఉండదు. అందువల్ల అటూ ఇటూ సౌర శక్తిని గ్రహించే సామర్థ్యమున్న ఫలకాలు నేరుగా సూర్యుడికేసి ఉంటాయి. దీనివల్ల గరిష్ఠ స్థాయిలో విద్యుదుత్పత్తి సాధ్యమవుతుంది.

ఇదీ చూడండి: చంద్రయాన్​-2: సాఫ్ట్​ ల్యాండింగ్​కు సర్వం సిద్ధం

Last Updated : Sep 29, 2019, 3:10 PM IST

ABOUT THE AUTHOR

...view details