కేరళలో జరుగుతోన్న ఛాంపియన్ బోట్ లీగ్ (సీబీఎల్)లో భాగంగా 5వ స్నేక్ బోట్ రేస్ పోటీలు కొచ్చి తీరంలో అట్టహాసంగా జరిగాయి. గత నాలుగు పోటీల్లో గెలిచి.. వరుస విజయాలతో దూసుకెళుతున్న నడుభాగం జట్టుకు ఛంబకులమ్ జట్టు షాకిచ్చింది. 17 మిల్లీ సెకన్ల తేడాతో తొలిస్థానాన్ని కైవసం చేసుకుంది.
960 మీటర్ల పోటీ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. మూడు జట్లు నువ్వానేనా అన్నట్లు పోటీపడ్డాయి. కేవలం క్షణాల వ్యవధిలోనే స్థానాలు మారిపోయాయి. ఛంబకులమ్ జట్టు 3 నిమిషాల 17.99 సెకన్లలో గమ్యాన్ని చేరుకుంది. నడుభాగం జట్టు 3 నిమిషాల 18.16 సెకన్లలో చేరింది. కరిచల్ జట్టు 3 నిమిషాల 18.41 సెకన్లతో మూడోస్థానంలో నిలిచింది.
5వ పోటీల అనంతరం సీబీఎల్ లీగ్లో 68 పాయింట్లతో నడుభాగం జట్టు మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఛంబకులమ్ జట్టు 37 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. దేవాస్ జట్టు 34 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. ఈ పోటీల్లో మొత్తం 9 జట్లు పాల్గొన్నాయి.