ఛత్తీస్గఢ్లో నక్సల్ ప్రాబల్య ప్రాంతమైన దంతెవాడలో ప్రజాస్వామ్యం వెల్లివిరిసింది. సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించాలన్న ప్రకటనలు, స్థానిక శాసనసభ్యుడ్ని హత్యచేసి నక్సలైట్లు సృష్టించిన భయాందోళనలను స్థానికులు బేఖాతరు చేశారు. పెద్దసంఖ్యలో ఓటింగ్లో పాల్గొంటున్నారు.
మంగళవారం భాజపా ఎమ్మెల్యే భీమా మండావి హత్యకు గురైన శ్యామగిరి గ్రామ పంచాయతీ పరిధిలోనూ పోలింగ్ సజావుగా సాగుతోంది. ఘటనా స్థలానికి దగ్గరలోని 220 పోలింగ్ బూత్ వద్ద రద్దీ నెలకొంది.
బస్తర్ నియోజకవర్గంలో 11 గంటల ప్రాంతంలోనే సుమారు 23 శాతం ఓట్లు పోలవటం విశేషం. బస్తర్లో ఏడుగురు అభ్యర్థులు పోటీలో నిలిచారు.
భారీ బందోబస్తు
నక్సల్స్ దాడి నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. బస్తర్ నియోజకవర్గంలో సుమారు 80వేల మంది సాయుధ బలగాలతో పహారా కాస్తోంది.