పౌరసత్వ జాబితా నమోదు ప్రక్రియ అసోంలో పౌరసత్వ నమోదును గడువులోపే పూర్తి చేస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం ఉండదనీ.. ఏ ఒక్క పౌరుడికి అన్యాయం జరగదనీ మంత్రి హామీ ఇచ్చారు.
ఎన్నార్సీ ప్రక్రియపై దృష్టి సారించడం లేదని, సాకులు చెబుతూ సమయం వృథా చేస్తున్నారని ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు మంగళవారం మందలించింది. దీనికి రాజ్నాథ్ గడువులోనే పూర్తి చేస్తామని స్పందించారు. పౌరసత్వ జాబితాకు చివరి గడువు 2019 జులై 31 మాత్రమేనని సుప్రీం మరోసారి స్పష్టం చేసింది.
1985లోనే అసోంలో ఎన్నార్సీకి సమ్మతి లభించినా, ముప్పై ఏళ్ల పాటు ఎవరూ పట్టించుకోలేదని రాజ్నాథ్ గుర్తు చేశారు. ఎన్డీయే ప్రభుత్వమే ఈ ప్రక్రియను బాధ్యతగా స్వీకరించిందని, ప్రస్తుతం చివరి దశకు చేరుకుందని తెలిపారు.
ఎన్నార్సీ చివరి జాబితా 2018 జులై 30న సిద్ధం చేశారు. దీనిపై అభ్యర్థనలు, ఆరోపణల స్వీకరణ 2018 డిసెంబర్ 31తో పూర్తయింది. అయితే జాబితాలో 40 లక్షల మంది పేర్ల గల్లంతుపై వివాదం రాజుకుంది. మొత్తం 3.29 కోట్ల మందికి గాను 2.9 కోట్ల మంది పేర్లు మాత్రమే జాబితాలో పొందుపరిచారు.