నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ చుట్టుపక్కల ఆందోళన చేస్తున్న రైతులను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్.. 40 వ్యవసాయ సంఘాలను ఉద్దేశిస్తూ తదుపరి విడత చర్చల కోసం తేదీ, సమయం వారే నిర్ణయించుకోవాలని తెలిపారు.
రైతులు లేవనెత్తుతున్న అంశాలపై న్యాయబద్ధ పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ఈ లేఖలో తెలిపారు. కనీస మద్దతు ధరను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల కూడా చర్చలకు రావాలని లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేయగా, బుధవారం వారు తిరస్కరించారు.