తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పర్యావరణానికి అక్షయంగా... సౌర ఇంధనం!

పర్యావరణానికి మేలు చేసేలా శుద్ధ ఇంధన ఉత్పాదనకు ప్రాధాన్యతనిస్తూ చమురు దిగుమతుల్ని తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వానికి తీపికబురు చెప్పారు పరిశోధకులు. దేశంలోని ప్రధాన వనరులను ఉపయోగించుకుంటే సౌరవిద్యుత్పత్తికి వీలుంటుందని చెబుతున్నారు. సౌర సామర్థ్యం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్​.. ఆ దిశగా అభివృద్ధి పథంలో పయనిస్తోందని కొన్ని నెలల క్రితం అంతర్జాతీయ కార్మిక సంస్థ భావించింది.

By

Published : Feb 21, 2020, 7:51 AM IST

Updated : Mar 2, 2020, 12:55 AM IST

Central government to reduce oil imports with emphasis on clean energy
పర్యావరణానికి అక్షయంగా... సౌర ఇంధనం!

పర్యావరణానికి మేలు చేసేలా శుద్ధ ఇంధన ఉత్పాదనకు విశేష ప్రాధాన్యమిచ్చి 2030 నాటికి చమురు దిగుమతుల్ని 10 శాతం మేర తెగ్గోయాలని సంకల్పించిన కేంద్రప్రభుత్వానికి తీపికబురిది. దేశంలోని ప్రధాన జలాశయాల ఉపరితలాలను సద్వినియోగపరచుకోగలిగితే ఎకాయెకి 280 గిగావాట్ల (ఒక గిగావాట్‌ అంటే వెయ్యి మెగావాట్లు) సౌర విద్యుదుత్పత్తికి వీలుందని నూతన అధ్యయనాంశాలు వెల్లడిస్తున్నాయి. ఈటీసీ (ఎనర్జీ ట్రాన్స్‌మిషన్‌ కమిషన్‌)లో అంతర్భాగమైన ఇంధన వనరుల సంస్థ అంచనా ప్రకారం- భారత్‌లో 18వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన జలాశయాల ఉపరితలాలు... అక్షరాలా, సౌర ఇంధన గనులు. తొలుత 2022 నాటికి 100 గిగావాట్ల సౌర సామర్థ్యం సంతరించుకోవాలని లక్షించిన ఇండియా, అప్పటికి 175 గిగావాట్ల ఉత్పత్తిని సాధించే దిశగా పురోగమిస్తున్నదని తొమ్మిది నెలలక్రితం అంతర్జాతీయ కార్మిక సంస్థ కితాబిచ్చింది. సరికొత్త మదింపు ప్రాతిపదికన నీటిపై సౌర విద్యుదుత్పాదన చురుగ్గా సాకారమైతే, మరిన్ని అద్భుతాలు తథ్యమన్న ఆశలిప్పుడు మోసులెత్తుతున్నాయి!

సౌరవిద్యుత్​ ప్రాజెక్ట్​

శిలాజ ఇంధనాల వినియోగం పెచ్చరిల్లడంవల్ల పర్యావరణ విధ్వంస పర్యవసానాల తీవ్రతను ఆకళించుకున్న పలు దేశాల్లో కొన్నాళ్లుగా ప్రత్యామ్నాయాల వేట సాగుతోంది. పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచుకునే క్రమంలో దశాబ్దం క్రితం క్యాలిఫోర్నియాలో నీటిపై తేలియాడే (ఫ్లోటో ఓల్టాయిక్‌) సౌర విద్యుత్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటైంది. క్రమేణా ఆ ఒరవడి ఇతర దేశాలకూ విస్తరించింది. అమెరికావ్యాప్తంగా మొత్తం విద్యుత్‌ సరఫరా రాశిలో జలాశయాలపై ఉత్పత్తవుతున్నది 10 శాతమని ప్రపంచబ్యాంకు మొన్నీమధ్య లెక్కకట్టింది. ప్రపంచం నలుమూలలా ఆ ఉత్పత్తి పోనుపోను 400 గిగావాట్లకు చేరనుందన్న అంచనాలు లోగడే వెలుగుచూశాయి. అందులో సగానికిపైగా భారత్‌లోని జలాశయాలపైనే అందిరానుందన్న అధ్యయనాంశాలు- ఎన్నో అవకాశాల ద్వారాల్ని తెరవగలిగేంత ప్రభావాన్వితమైనవి!

కేంద్రం ఖరారు

నివాసాలపై సౌర విద్యుదుత్పత్తిలో గ్రేటర్‌ హైదరాబాద్‌ చురుగ్గా ఉందన్న కథనాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపట్ల ఇనుమడించిన జన చేతనకు అద్దంపడుతున్నాయి. ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీల్లో సౌర విద్యుత్‌ ఫలకాల ఏర్పాటుకు ధరలు, రాయితీలను కేంద్రం ఇటీవలే ఖరారు చేసింది. విశ్వవిద్యాలయాలు, సర్కారీ ఆస్పత్రులు, రైల్వేల్లో సౌర విద్యుత్‌ విజయ గాథలు తరచూ వింటున్నాం. సుమారు అయిదేళ్ల క్రితం గుజరాత్‌లోని వడోదరాలో ఒక నీటి కాల్వపై 10 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణం ఎందరినో విస్మయపరచింది. సాధారణంగా భూమ్మీద అటువంటి ప్రాజెక్టు కోసం దాదాపు 50వేల ఎకరాల దాకా సేకరించాల్సి ఉంటుంది. కాల్వపై నిర్మాణంవల్ల స్థల సేకరణ సమస్యను అధిగమించడం ఒక్కటే కాదు, ఎండ వేడిమికి నీరు ఆవిరయ్యే వేగాన్నీ గణనీయంగా నియంత్రించడం కీలకాంశం. జర్మనీ వంటిచోట్ల జలాశయాలపై అటువంటి ప్రాజెక్టుల వ్యయం 10-15 శాతం అధికమైనట్లు తేలినా, దీర్ఘకాలిక ప్రయోజనాల రీత్యా అదేమంత సమస్య కాదని నిపుణులు కొట్టిపారేస్తున్నారు.

అవసరమైన జాగ్రత్తలు

విశాఖ ముడసర్లోవ, మేఘాద్రిగడ్డ రిజర్వాయర్లలో నీటిపై తేలియాడే సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల కోసం ఇనుము స్థానే అల్యూమినియం వాడకం సత్ఫలితాలిచ్చింది. జర్మన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో ఫలకాలు నెలకొల్పిన అక్కడ నీటిమట్టం తగ్గినా పెరిగినా ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సుమారు 120 దేశాల ఇంధనావసరాలకు పనికొచ్చే వేదికగా నాలుగేళ్ల క్రితం ప్రధాని మోదీ ఐఎస్‌ఏ (అంతర్జాతీయ సౌర కూటమి)కి శ్రీకారం చుట్టడం తెలిసిందే. ఆ సంస్థ సేవలను, జలాశయాలపై విద్యుదుత్పాదన కృషిలో ఇప్పటికే ముందడుగేసిన దేశాల అనుభవాలను అందిపుచ్చుకొంటే- సౌర ఇంధనంతో వెలుగుబాటలో భారత్‌ ప్రగతి ప్రస్థానం సుసాధ్యమవుతుంది. ఆ మేరకు వ్యవస్థాగత దిద్దుబాట్లతో పకడ్బందీ వ్యూహాలు సత్వరం పట్టాలకు ఎక్కాల్సిన తరుణమిది!

జపాన్​ ఘనత

సౌర విద్యుత్‌ రంగంలో పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ పురోగమిస్తున్న చైనా ఆ మధ్య వైనాన్‌ నగరానికి చేరువలో కూలిపోయిన బొగ్గు గనిపై కృత్రిమ సరస్సు ఏర్పరచి లక్షా 66వేల ఫలకాలతో 40 మెగావాట్ల ఉత్పత్తి సాధించి అబ్బురపరచింది. అత్యధికంగా అరవైకిపైగా జలాశయాలపై సౌర ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన ఘనత ఇప్పటిదాకా జపాన్‌ది. ఇండొనేసియా, చిలీ, తైవాన్‌, న్యూజిలాండ్‌ ప్రభృత దేశాలు నీటిపై తేలియాడే సౌర విద్యుదుత్పాదక కేంద్రాలకు కొత్త చిరునామాలుగా నిలదొక్కుకుంటున్నాయి. వాటన్నింటికన్నా మిన్నగా రాణించగల సహజ బలిమి భారత్‌కుంది. భౌగోళికంగానూ మనకు ప్రధాన సానుకూల అంశం ఉంది. భూగోళంపై కర్కాటక, మకర రేఖాంశాల నడుమ ఏటా 300 రోజులకుపైగా అపార భానుతాపం ప్రసరించే దేశాల్లో ఇండియా ఒకటి. ఇది నిజంగానే, అయాచిత వరం.

సూర్యరశ్మి - అక్షయనిధి

బొగ్గు, సహజవాయు నిక్షేపాలు ఎప్పటికైనా హరాయించుకుపోయేవే. వాటి సరఫరాలు తగ్గితే విద్యుదుత్పాదన పడకేయాల్సిందే. సూర్యరశ్మి అలా కాదు, అది అక్షయ నిధి. పంట పొలాలపై సౌర ఫలకాల అమరిక ద్వారా దిగుబడులూ అధికమవుతాయని గతంలోనే రుజువైంది. జలాశయాలపై సౌర ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తే ఎన్నో చెట్లపై గొడ్డలి వేటును నివారించగల వీలుంటుంది. ఉపరితలాలపై ఫలకాల ఏర్పాటు కారణంగా జలాలశుద్ధి ఖర్చూ తప్పుతుంది. ఇంధన వనరుల సంస్థ నివేదికా తాజాగా నిర్ధారించిందదే. 85శాతం స్వీయ అవసరాలకు జర్మనీ సౌర, పవన విద్యుత్తునే వినియోగిస్తోంది. 2019 సంవత్సరం చివరికి భారత దేశ మొత్తం విద్యుత్‌ స్థాపిత సామర్థ్యంలో సౌర పద్దు 10శాతంలోపు. ఈ పరిస్థితిని సాధ్యమైనంత త్వరగా తిరగరాయాలన్న పట్టుదల, నిబద్ధత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రదర్శితమైనప్పుడే- దేశ విద్యుత్‌ రంగాన కొత్త పొద్దుపొడుపు!

ఇదీ చదవండి:'సైన్యంలో లింగ భేదాలకు తావు లేదు'

Last Updated : Mar 2, 2020, 12:55 AM IST

ABOUT THE AUTHOR

...view details