కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసుకునేలా(వర్క్ ఫ్రం హోం) వీలు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గ్రూప్ బీ, సీకి చెందిన 50శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయాలని, మిగిలిన వారు కార్యాలయాలకు రావాలని సూచించింది. ఈ మేరకు సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
"గ్రూప్-బీ, సీ సిబ్బంది ప్రత్యామ్నాయ పద్ధతిలో కార్యాలయాలకు వచ్చేలా రోస్టర్ విధానాన్ని రూపొందించాలని అన్ని శాఖల అధిపతులకు సూచిస్తున్నాం. ఇంటి నుంచి పనిచేసే అధికారులు ఫోన్లలో తప్పకుండా అందుబాటులో ఉండాలి. అత్యవసర సమయంలో వారు కూడా ఆఫీసుకు రావాల్సి ఉంటుంది."
-సిబ్బంది వ్యవహారాల శాఖ ఆదేశాలు
ఆఫీసులకు హాజరయ్యే ఉద్యోగుల సమయంలోనూ మార్పులు చేసింది. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5:30, ఉదయం 9:30 నుంచి 6గంటలు, ఉదయం 10 నుంచి సాయంత్రం 6:30 వరకు పనిచేసేలా నూతన సమయపాలన పట్టిక రూపొందించింది. ఉద్యోగులను మూడు గ్రూపులుగా విభజించి ఆ సమయాల్లోనే హాజరయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించింది.