జనాభా లెక్కలు సేకరణలో కులాల వారీగా లెక్కలు తేల్చాలని కొన్ని రాష్ట్రాల డిమాండ్‌ను కేంద్రం తోసిపుచ్చింది. అలాంటిది లేకుండానే 2021లో జనాభా వివరాల సేకరణకు రంగం సిద్ధం చేస్తోంది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినవారు (ఎస్‌ఈబీసీలు), ఇతర వెనుకబడినవారు (ఓబీసీలు), మిగిలిన కులాల వివరాలను సేకరించడం లేదు. ఈ విషయంలో మహారాష్ట్ర, బిహార్ శాసనసభలు చేసిన డిమాండ్లను తిరస్కరించినట్లే ఒడిశాలోని అధికార బిజద లోక్‌సభలో చేసిన డిమాండునూ కేంద్రం తోసిపుచ్చింది. ‘సామాజిక-ఆర్థిక కుల గణన’ (ఎస్‌ఈసీసీ) సమాచారాన్ని వినియోగించుకునేందుకు వీలు కల్పించాలని దేశవ్యాప్తంగా ఓబీసీల ఉప వర్గీకరణకు నియమితమైన జాతీయ కమిషన్ చేసిన అభ్యర్థననూ ప్రభుత్వం తిరస్కరించింది. కులాల వారీగా వివరాలు సేకరిస్తే జనాభా లెక్కల సేకరణ ప్రాథమిక ఉద్దేశానికే విఘాతం కలుగుతుందని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
ఏప్రిల్‌లో శ్రీకారం
2021 జనగణన కార్యక్రమం రెండు దశల్లో జరగనుంది. తొలిదశకు ఈ ఏడాది ఏప్రిల్/ మే నెలల్లోనే శ్రీకారం చుడతారు. ఇళ్ల సంఖ్యను లెక్కించడం, జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్)ను తాజాపరచడం వంటివి ఈ దశలో ఉంటాయి.
- 2021 తొలినాళ్ల నుంచి రెండో దశలో జనగణన మొదలవుతుంది. ఆ మేరకు పునఃపరిశీలనను వచ్చే ఏడాది మార్చిలో చేపడతారు.
- జనాభా లెక్కలకు ఈసారి నుంచి పెన్ను, కాగితాలతో పని ఉండదు. మొత్తం పనిని మొబైల్ యాప్ ద్వారా పూర్తి చేస్తారు.
- క్షేత్రస్థాయి గణకుల్లో ఒక్కొక్కరూ సుమారు 150 ఇళ్లకు వెళ్తారు. 600 నుంచి 800 మంది వివరాలను సేకరిస్తారు.
- ఇంటింటికీ వెళ్లినప్పుడు కుటుంబ యజమాని మొబైల్ నంబరు, ఇంట్లో ఉన్న మరుగుదొడ్ల సంఖ్య, టీవీ, ఇంటర్నెట్, సొంత వాహనాలు, తాగునీటి వనరులు వంటి వివరాలన్నీ తీసుకుంటారు.
- దళితులు, గిరిజనుల వివరాలతో పాటు, ఏ మతానికి చెందినవారు ఎంతమంది ఉన్నారనేది తెలుసుకుంటారు.