ఈ నెల 22 నుంచి జరగనున్న సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే 12వ తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ ఏ విధంగానూ సహాయపడకపోవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఉన్నత విద్య కోసం ప్రవేశాల ప్రక్రియ కళాశాలలు, విశ్వవిద్యాలయాల చేతిలో ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది. కరోనా నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారించిన జస్టిస్ ఏఎమ్ ఖన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
సీబీఎస్ఈ పరీక్షలు ఈ నెల 22 నుంచి 29 వరకు జరగనున్నాయి. వీటితో పాటు మార్కులు మెరుగుపరచుకోవాలనుకుంటున్న 12వ తరగతి విద్యార్థులకూ పరీక్షలు నిర్వహించనుంది సీబీఎస్ఈ.
అయితే పరీక్షలు పూర్తయ్యే సరికే అనేక వర్సిటీల్లో అడ్మిషన్లు అయిపోతాయని పిటిషనర్ల తరపున న్యాయవాది వివేక్ తంఖా సర్వోన్నత న్యాయస్థానికి తెలిపారు. పరీక్షల ఫలితాలు వెలువడకపోవడం వల్ల విద్యార్థులకు ఆయా కళాశాలల్లో ప్రవేశం లభించదని.. వారు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. అందువల్ల ఫలితాలు వెలువడేంత వరకు వర్సిటీలు వేచిచూడాలని.. లేదా అడ్మిషన్లలో వెసులుబాటు కల్పించే విధంగా కళాశాలలను సీబీఎస్ఈ అభ్యర్థించాలని కోరారు.