కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) డీఐజీకి లంచం ఇవ్వజూపారన్న ఆరోపణపై సోమా ఎంటర్‌ప్రైజస్ ఉపాధ్యక్షుడు పి.ఆర్.రావును శుక్రవారం ఆ శాఖ అధికారులు అరెస్టు చేశారు. ఇదే వ్యవహారంలో గురువారం కేంద్ర హోంశాఖ ఉద్యోగి ధీరజ్ సింగ్, సోమా సంస్థ ఉద్యోగి దినేశ్ చంద్ గుప్తను అరెస్టు చేయగా, దానికి కొనసాగింపుగా రావును కస్టడీలోకి తీసుకున్నారు.
లంచం ఆరోపణలతో.. 'సోమా' ఉపాధ్యక్షుడి అరెస్టు
సీబీఐ ఉన్నతాధికారికి లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలతో సోమా ఎంటర్ప్రెజస్ ఉపాధ్యక్షుడు పీఆర్ రావును శుక్రవారం అరెస్టు చేశారు అధికారులు. ఈ వ్యవహారంలో ఇంతకుముందే హోం శాఖ ఉద్యోగి ధీరజ్, సోమా ఉద్యోగి దినేశ్ చంద్ గుప్తలు అరెస్టు అయ్యారు.
విచారణలో ఉన్న ఓ కేసును సోమా సంస్థకు అనుకూలంగా మార్చేందుకు రూ. 2 కోట్లు ఇస్తామంటూ డీఐజీ ఆశ్రా గర్గ్‌కు హోంశాఖ పోలీసు-1 డివిజన్లో పనిచేస్తున్న ధీరజ్ సింగ్ ఆశచూపారు. సోమా సంస్థ ఉద్యోగి గుప్తను కూడా పరిచయం చేశారు.
దీనిపై గర్గ్ ఈ నెల 11న ఫిర్యాదు చేయడంతో వారిని పట్టుకోవడానికి సీబీఐ ఉన్నతాధికారులు వ్యూహం రూపొందించారు. సీబీఐ ప్రధాన కార్యాలయం సమీపంలోని సీఎన్జీ బంకు వద్దకు బుధవారం రాత్రి 11 గంటలకు ధీరజ్‌తో వచ్చిన గుప్తా... ఇంటి వద్ద రూ. 10 లక్షలు ఉన్నాయని, వాటిని ఇస్తానని గర్గ్‌కు చెప్పారు. తరువాత సంస్థ ఉపాధ్యక్షుడు రావుతో మాట్లాడించారు. ఈ సందర్భంగా జరిగిన ఫోను సంభాషణలను రికార్డు చేసిన సీబీఐ అధికారులు తదుపరి చర్యగా అరెస్టులు చేశారు.