133 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. నెహ్రూ-గాంధీల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ... సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో పార్టీ పగ్గాలను అనుభవజ్ఞులైన పాతతరం నాయకులకు అప్పగించాలా? లేదా యువనేతలకు అప్పగించాలా? అనే మీమాంసలో కాంగ్రెస్ ఉంది.
యువనేత...కావాలి
ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ వారసుడిగా... ఓ యువనేతను ఎన్నుకోవాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సూచించారు. ప్రస్తుతానికి ఎవరి పేర్లూ బహిరంగంగా ప్రకటించకపోయినప్పటికీ... కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్, కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా ముందు వరుసలో ఉన్నారు.
కాంగ్రెస్ 'పైలట్' సచిన్..?
రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న 41 ఏళ్ల సచిన్ పైలట్... ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విజయతీరాలను చేర్చారు. ఆయనకు పార్టీలో క్షేత్రస్థాయి అనుభవమూ ఉంది.
సింధియాకే పగ్గాలా..?
మధ్యప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న 48 ఏళ్ల జ్యోతిరాదిత్య సింధియా ఈ లోక్‌సభ ఎన్నికల్లో స్వయంగా ఓటమి పాలైనప్పటికీ.. క్షేత్రస్థాయిలో డైనమిక్ లీడర్‌గా గుర్తింపు ఉంది.
రేసులో దేవరా..?
యువనేతల్లో పైలట్, సింధియా ఇతరులకన్నా ముందున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, మాజీ కేంద్రమంత్రి మిలింద్ దేవరా కూడా రేసులో ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముంబయి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన 42 ఏళ్ల దేవరా, కాంగ్రెస్ పార్టీని ఓ కొలిక్కితీసుకురావడానికి జాతీయస్థాయిలో తన వంతు పాత్ర పోషించడానికి ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
అధ్యక్ష పదవి రేసులో... అతిరథులు
కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో పార్టీ సీనియర్ నాయకులు సుశీల్ కుమార్ శిందే, మల్లికార్జున ఖర్గే, మోతీలాల్ వోరా, అశోక్ గెహ్లోత్ ఉన్నారు. అయితే దీనిపై అధికారిక ధ్రువీకరణ లేదు.
రాజీనామాల పర్వం..
రాహుల్‌గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో...పార్టీ యువనేతలూ అదేబాటపట్టారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శి పదవిని సింధియా వదులుకున్నారు. ముంబయి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మిలింద్ దేవరా, యువజన కాంగ్రెస్ అధ్యక్షపదవికి కేశవ్ చంద్ యాదవ్ రాజీనామాలు చేశారు. లోక్‌సభ ఎన్నికల పరాజయానికి జవాబుదారీతనం కోసమే ఇలా చేశామని వారు వివరణ ఇచ్చారు.