తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేబినెట్ ఆమోదముద్ర

ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర కేబినెట్​ మరోసారి భేటీ అయింది. ఈ సమావేశంలో పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.

కేబినెట్ ఆమోదముద్ర

By

Published : Mar 8, 2019, 5:39 AM IST

ఎన్నికల నగారా మోగేందుకు గడువు దగ్గర పడుతున్న సమయంలో పలు అభివృద్ధి పనులకు కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది. మౌలిక వసతులు, పారిశ్రామిక రంగాల్లోని పలు కార్యక్రమాలకు కేంద్రం పచ్చజెండా ఊపింది.

మెట్రో రైలు

దిల్లీ, ముంబై మెట్రో రైలు విస్తరణ, దిల్లీలో నాలుగో దశ మెట్రో రైలు, ముంబైలో మూడో దశ పట్టణ రవాణా వ్యవస్థకు కేబినెట్​ ఆమోదం తెలిపింది

విమానాశ్రయాల అభివృద్ధి

విమానయాన సేవల్ని విస్తృతం చేసేందుకు కేబినెట్​ నిర్ణయించింది. దేశంలోని విమానాశ్రయాల అభివృద్ధికి రూ.4500 కోట్లు మంజూరుకు మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. రాష్ట్రాల పరిధిలో నిర్మాణంలో ఉన్నవాటికి, విమానాశ్రయాల పునరుద్ధరణకు ఈ నిధులు వెచ్చించనున్నారు.

జల విద్యుత్ ప్రాజెక్టులు

3,760 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన నాలుగు జల విద్యుత్​​ ప్రాజెక్టుల నిర్మాణానికి రూ. 31,560 కోట్ల కేటాయింపునకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వీటితో పాటు సోలార్, పవన విద్యుత్​ ప్రాజెక్టులకు కేటాయింపులు చేసింది.

చక్కెర కర్మాగారాలకు ఊతం

చక్కెర కర్మాగారాలకు రూ.12,900 కోట్ల అదనపు రుణాలు అందించేందుకు మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. ఇటీవల ప్రారంభించిన కొత్త పథకానికి అనుగుణంగా ఇథనాల్​ సామర్థ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంది. వీటితో పాటు మొలాసెస్​ ఆధారిత డిస్టిలరీలకు రూ. 2,600 కోట్లను అందించనుంది.

విద్యారంగం

దేశ వ్యాప్తంగా మరో 50 కేంద్రీయ విద్యాలయాలకు అనుమతులిచ్చింది కేబినెట్. సీఆర్పీఎఫ్, రైల్వే ఉద్యోగులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. వీటితో సుమారు లక్ష మంది విద్యార్థులకు ప్రయోజనంతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్​ వ్యాఖ్యానించారు. వచ్చే ఐదేళ్లలో వీటికోసం రూ. 1,579.9 కోట్లను ఖర్చు పెట్టనున్నారు.

కేంద్రీయ విద్యాసంస్థల్లో 200 పాయింట్​ రోస్టర్​ విధానాన్ని పునురుద్ధరించారు. దీని ప్రకారం కళాశాలను లేదా విశ్వవిద్యాలయాన్ని ఒక యూనిట్​గా పరిగణిస్తారు. దీని ప్రకారమే రిజర్వేషన్ల ఆధారంగా ఉపాధ్యాయుల నియామకం చేపడతారు.

వస్త్ర పరిశ్రమలో పన్ను తగ్గింపు

వస్త్ర పరిశ్రమలో పన్నులను తగ్గిస్తూ కేబినెట్​ నిర్ణయం తీసుకుంది. మార్కెట్​లో పోటీతత్వం పెంపొందించే విధంగా రవాణాపై పూర్తిస్థాయిలో పన్ను తగ్గింపుకు చర్యలు తీసుకుంది.

ఈసీహెచ్​ఎస్​

మాజీ సైనిక ఉద్యోగుల ఆరోగ్య పథకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వారు, ఎమర్జెన్సీ కమిషన్​ అధికారులు, తక్కువ సర్వీస్​ కలిగినవారు, స్వతహాగా పదవీ విరమణ పొందిన వారికి సైతం ఈ పథకం వర్తించనుంది.

ABOUT THE AUTHOR

...view details