తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతులపై మోదీ సర్కార్​​ వరాల జల్లు

కేంద్రంలో రెండోసారి అధికారాన్ని చేపట్టిన మోదీ ప్రభుత్వం... రైతులకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల్లో ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ప్రకారం పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధి పథకాన్ని దేశంలోని రైతులందరికీ వర్తింపజేస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అలాగే చిన్న, సన్నకారు రైతుల పింఛను పథకానికి ఆమోదం తెలిపింది కేంద్ర మంత్రివర్గం.

రైతులపై మోదీ సర్కార్​​ వరాల జల్లు

By

Published : May 31, 2019, 8:44 PM IST

Updated : Jun 1, 2019, 12:04 AM IST

సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు వరాలు ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు సమావేశమైన మంత్రివర్గం రైతులకు లబ్ధి చేకూర్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంది.

రైతులందరికీ ఆర్థిక సాయం

ప్రధాన మంత్రి కిసాన్​ సమ్మాన్ నిధి​ పథకాన్ని దేశంలోని రైతులందరికీ వర్తింపజేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది కేంద్ర మంత్రివర్గం. ఈ నిర్ణయంతో దేశంలోని సుమారు 14.5 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కింద ఏడాదికి ప్రతీ రైతుకు రూ.6 వేల ఆర్థిక సాయం అందించనుంది కేంద్రం.

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మధ్యంతర బడ్జెట్​ సమావేశాల్లో కిసాన్​ సమ్మాన్​ నిధి పథకాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. 5 ఎకరాల్లోపు భూమి ఉన్న చిన్న,సన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులని ప్రకటించింది. సుమారు 12 కోట్ల మంది లబ్ధి పొందుతారని ప్రకటించింది.

3.11 కోట్ల మందికి మొదటి విడతగా ఒక్కొక్కరికి రూ. 2 వేలు అందాయి. 2.66 కోట్ల మంది కర్షకులకు రెండో విడత ఆర్థిక సాయం అందింది.

అయితే ఆ 5ఎకరాల నిబంధనను ఎత్తివేసి, రైతులందరికీ పథకాన్ని వర్తింపజేస్తూ ఇప్పుడు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

రైతులకు పింఛను పథకం

దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, సన్నకారు రైతులకు పింఛను పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద 60ఏళ్లు దాటిన రైతులకు నెలకు రూ.3వేలను పింఛనుగా అందించనుంది ప్రభుత్వం. రానున్న మూడేళ్లలో ఈ పథకం కింద కనీసం 5 కోట్ల మంది చిన్న, సన్నకారుల రైతులను నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి ఏటా ఈ పథకానికి రూ.10,774.5 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేసింది.

ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు. ఈ పథకంలో నమోదై పింఛన్​ పొందుతున్న సమయంలో లబ్ధిదారుడు మరణిస్తే జీవిత భాగస్వామికి 50 శాతం పింఛన్​ అందిస్తారు. సగం పింఛన్​ పొందాలంటే భార్య లేదా భర్త పథకంలో నమోదై ఉండకూడదు.

పశువులకు ప్రత్యేక వ్యాక్సినేషన్​​ పథకం

పెంపుడు జంతువులైన ఆవులు, ఎద్దులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులకు తరుచుగా సోకే మూతి, కాళ్ల పుండ్లు, బ్రుసెల్లా వైరస్​ వంటి వ్యాధులను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వచ్చే ఐదేళ్లలో ఈ వ్యాధులను అరికట్టి పూర్తిగా నివారించేందుకు గానూ రూ.13,343కోట్లతో వాక్సినేషన్​ చేపట్టనున్నారు.

దేశంలోని సుమారు 30 కోట్ల ఆవులు, ఎద్దులు, గేదెలు, 20 కోట్ల గొర్రెలు, మేకలు, కోటి పందులకు టీకాలు అందనున్నాయి.

గతంలో ఇలాంటి టీకాల కార్యక్రమం కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్యంతో చేపట్టేవారు. కానీ ప్రస్తుతం పూర్తి ఖర్చును కేంద్రమే భరించాలని నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి: రిటైల్​ వ్యాపారులు, దుకాణదారులకు పింఛన్​ పథకం

Last Updated : Jun 1, 2019, 12:04 AM IST

ABOUT THE AUTHOR

...view details