ఎన్డీయే ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన 8 మంత్రివర్గ ఉపసంఘాల్లోనూ కేంద్ర హోంమంత్రి అమిత్షా భాగస్వామిగా ఉన్నారు. ఇది మోదీ 2.0 ప్రభుత్వంలో అమిత్షా ప్రాముఖ్యతను చాటిచెబుతోంది.
కేంద్ర ప్రభుత్వం గురువారం కొత్తగా 8 మంత్రివర్గ ఉపసంఘాలను ఏర్పాటుచేసింది. వీటిలో నియామకాలు, భద్రత, ఆర్థిక వ్యవహారాలు చూసే కీలక కమిటీలు ఉన్నాయి. వీటితో పాటు వసతులు, పార్లమెంటరీ వ్యవహారాలు, పెట్టుబడుల్లో పురోగతి, ఉద్యోగ భద్రత, నైపుణ్యాభివృద్ధి అంశాలపై మంత్రివర్గాలను ఏర్పాటు చేసింది మోదీ ప్రభుత్వం.
వీరికి ప్రాధాన్యం తగ్గిందా..
వీటిలో ప్రధాని మోదీ 6 ఉపసంఘాల్లో, హోం మంత్రి అమిత్ షా అన్ని ఉపసంఘాల్లో భాగస్వాములుగా ఉన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడు కమిటీల్లో సభ్యురాలుగా ఉన్నారు.
గత ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన రాజ్నాథ్ సింగ్ ఆరు కేబినెట్ కమిటీల్లో సభ్యులుగా ఉండేవారు. ప్రస్తుతం ఆయన రక్షణమంత్రిగా ఉన్నా.. కేవలం ఆర్థిక వ్యవహారాలు, భద్రత కమిటీల్లో మాత్రమే భాగస్వామిగా ఉన్నారు. కీలకమైన రాజకీయ వ్యవహారాల కమిటీలో ఆయనకు చోటు కల్పించకపోవడం గమనార్హం.
ఈ విషయాలను పరిశీంచిన మీదట, ప్రస్తుతం భాజపాలో మోదీ తరువాత అత్యంత కీలకమైన వ్యక్తి, నెం-2 అమిత్షా మాత్రమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.