తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చెరకు రైతులకు మళ్లీ నిరాశే మిగిలింది - ఆధార్ సవరణ బిల్లు

కేంద్రమంత్రి వర్గం... 'ఆధార్ చట్టం'​ సవరణకు ఆమోదం తెలిపింది. చెరకు రైతులకు, మిల్లర్లకు లబ్ధి చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫాక్ట్​ ఆస్తుల విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని అదే సంస్థకు వినియోగించాలని నిర్ణయించింది.

పలు 'చట్ట సవరణ'లకు కేంద్రమంత్రివర్గం ఆమోదం

By

Published : Jul 24, 2019, 9:03 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆధార్​ సహా పలు చట్టాల సవరణలకు ఆమోదం తెలిపింది.

ఆధార్​ సవరణ బిల్లుకు ఆమోదం

ఆధార్​ సవరణ బిల్లు-2019ని కేంద్రమంత్రి వర్గం ఆమోదించింది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, రాయితీల కోసం ఆధార్ డేటాను (బయోమెట్రిక్ ఐడీ) ఉపయోగించుకోవడానికి వీలు కలుగుతుంది.

"దేశంలో 128 కోట్ల ఆధార్​ కార్డులు నమోదై ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ రాయితీల బదిలీకి ఆధార్ ఉపయోగించడం వల్ల నకిలీ లబ్ధిదారులను గుర్తించడానికి, తొలగించడానికి వీలవుతుంది."
-ప్రకాశ్​ జావడేకర్, కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి

స్వచ్ఛందమే..

'ఆధార్' స్వచ్ఛంద వినియోగాన్ని అనుమతించేలా ఈ నెల ప్రారంభంలో పార్లమెంట్ ఓ సవరణ తీసుకొచ్చింది. ఫలితంగా మొబైల్ ఫోన్ సిమ్​ కార్డులు పొందటానికి, బ్యాంకు ఖాతాలు తెరవడానికి ఆధార్​ను ఐడీ ప్రూఫ్​గా ఉపయోగించుకోవాలా? లేదా? అన్నది ఇకపై వినియోగదారుడు నిర్ణయించుకుంటాడు.

చెరకు రైతులకు మిగిలింది నిరాశే..

చెరకు రైతులకుకేంద్ర ప్రభుత్వం మళ్లీ నిరాశనే మిగిల్చింది. చెరకు కొనుగోలు కోసం మిల్లుల యజమానులు రైతులకు చెల్లించాల్సిన కనీస మద్దతు ధరే... ఎఫ్​ఆర్​పి (ఫెయిర్​ అండ్ రెమ్యునరేటివ్​ ప్రైస్​). అయితే 2019-20 మార్కెట్ సంవత్సరానికి (అక్టోబర్​- సెప్టెంబర్​) కూడా క్వింటాల్​కు రూ.275 మద్దతు ధరనే కొనసాగించి రైతుల ఆశలపై నీళ్లు జల్లింది.

2019-20 మధ్య 4 మిలియన్ టన్నుల చక్కెర బఫర్​ స్టాక్(అదనపు నిల్వలు)​ను పెంచేందుకు ఆహార మంత్రిత్వశాఖ చేసిన ప్రతిపాదనలకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్​ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపి కాస్త ఊరట కలిగించింది. అలాగే 2019-20 సీజన్​లో రైతులకు చక్కెర మిల్లుల బకాయిలు రూ.15 వేల కోట్లు చెల్లించాలని కేంద్రమంత్రివర్గం నిర్ణయించింది.

'ఫాక్ట్'​కే వినియోగించాలి

ఫెర్టిలైజర్స్​ అండ్ కెమికల్స్ ట్రావెన్​కోర్​ (ఫాక్ట్​) వద్ద ఉన్న 481.79 ఎకరాల భూమిని కేరళ ప్రభుత్వానికి విక్రయించి.. వచ్చిన ఆదాయాన్ని ఫాక్ట్​కే వినియోగించాలన్న ప్రతిపాదనను కేంద్రమంత్రివర్గం ఆమోదించింది.

నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ మైనర్స్ హెల్త్​ను... నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ ఆక్యుపేషనల్​ హెల్త్​లో విలీనం చేయడానికీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఇదీ చూడండి: ఉగ్రవాద వ్యతిరేక బిల్లుకు లోక్​సభ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details