సుప్రీం జడ్జీల సంఖ్య పెంపు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 30 నుంచి 33కు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రధాన నాయమూర్తి కాకుండా మిగిలిన న్యాయమూర్తుల సంఖ్యను 30 నుంచి 33కు పెంచనున్నారు.
ఈ మేరకు పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభిస్తే సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ప్రధాన న్యాయమూర్తితో కలుపుకుని 34కి చేరనుంది. దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకుంది.
ఎరువులపై సబ్సిడీ పెంపు
రైతులకు వ్యవసాయ రసాయన పోషకాలను అందుబాటు ధరల్లో అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూరియాయేతర ఎరువులపై రాయితీని కేంద్రం పెంచింది. తాజా నిర్ణయం ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నైట్రోజన్‌పై సబ్సిడీ కేజీకి రూ.18.90, ఫాస్పరస్‌పై కేజీకి రూ.15.11, పొటాష్‌పై రూ.11.12, సల్ఫర్‌పై కేజీకి రూ.3.56 పెరగనుంది.
ఈ పెంపుతో కేంద్ర ఖజానాపై సుమారు రూ.22,875 కోట్ల భారం పడనుంది. 2010లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పోషక విలువల ఆధారిత సబ్సిడీ విధానం ప్రకారం ప్రతి ఏడాది ఈ రసాయనాల ధరలను నిర్ణయిస్తోంది కేంద్రం.
మరిన్ని నిర్ణయాలు..
- జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ బిల్లు-2019: రెండో సవరణ బిల్లు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లతో పాటు విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనకబడిన తరగతులకు 10 శాతం కోటా పెంపు
- చిట్‌ఫండ్స్ బిల్లు (సవరణ): రిజిస్టర్డ్ చిట్‌ఫండ్స్ సంస్థల క్రమబద్దీకరణలో సంక్లిష్ట ప్రక్రియ తొలగింపుతో పాటు చిట్ చందాదారులకు పూర్తి రక్షణ కల్పించే చట్టం
- ఇస్రో: మాస్కోలో ఇస్రో సంబంధిత సాంకేతిక కేంద్రం ఏర్పాటు. రష్యాలోని అంతరిక్ష సంస్థలు, పరిశ్రమలతో పరస్పర సహకారానికే ఈ కేంద్రం. ఇందుకు ఇస్రో, బొలీవియన్ అంతరిక్ష సంస్థతో కుదిరిన అవగాహన ఒప్పందానికి ఆమోదం.
- ఐరాస ఒడంబడిక: విదేశీ పెట్టుబడులకు సానుకూల అవకాశాలు కల్పించేందుకు అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించిన ఐరాస ఒడబండికకు ఆమోదం.
ఇదీ చూడండి: కర్ణాటకీయం: రాజకీయ జగన్నాటకం సశేషమే!