తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​- అమెరికా 2+2 చర్చలపై 'పౌరసత్వ, కశ్మీర్​' నీడలు

ఈ నెల 18 నుంచి భారత్​-అమెరికా మధ్య వాషింగ్టన్​లో రెండో దఫా 2+2 చర్చలు జరగనున్నాయి. విదేశాంగ మంత్రి జయ్​శంకర్​, రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​... అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రులతో భేటీ కోసం ఇప్పటికే వాషింగ్టన్​ చేరుకున్నారు. ఈ కీలక చర్చలకు ముందు పౌరసత్య చట్టంపై ఆందోళనలు, కశ్మీర్​ అంశాలు.. ప్రముఖ అమెరికా పత్రికల ప్రధాన శీర్షికలుగా నిలిచాయి. మరి వీటి ప్రభావం చర్చలపై పడుతుందా?

CAA PROTESTS, KASHMIR DOMINATE US HEADLINES
భారత్​-అమెరికా 2+2 చర్చలపై 'పౌరసత్వ, కశ్మీర్​' నీడలు

By

Published : Dec 17, 2019, 7:59 PM IST

భారత్​లో పౌరసత్వ చట్ట వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారడం, కశ్మీర్​ అంశం... ప్రస్తుతం అమెరికా ప్రముఖ పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా నిలిచాయి. రేపటి నుంచి భారత్​-అమెరికా మధ్య వాషింగ్టన్​లో రెండో దఫా 2+2 చర్చలు జరగనున్న తరుణంలో ఈ వార్తలకు ప్రాధాన్యం ఏర్పడింది.

భారత విదేశాంగ, రక్షణ మంత్రులు జయ్​శంకర్​, రాజ్​నాథ్​ సింగ్​... అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి మైక్​ పాంపియో, రక్షణ మంత్రి మార్క్​ ఎస్పర్​తో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ అమెరికా పత్రికలు న్యూయార్క్​ టైమ్స్​, వాల్​స్ట్రీట్​ జర్నల్, వాషింగ్టన్​ పోస్ట్​.. పౌరసత్వ చట్టంపై హింసాత్మక ఆందోళనలు, కశ్మీర్​ అంశాన్ని ప్రస్తావిస్తూ కథనాలను ప్రచురించాయి.

​ "నిరసనలు తీవ్రమవుతున్నాయి. భారత్...​ హిందుత్వ దేశంగా మారేందుకు దగ్గరగా ఉందా?" అంటూ న్యూయార్క్​ టైమ్స్​ పేర్కొంది.

"ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వేలాది మంది ముస్లింలను కశ్మీర్​లో నిర్బంధించింది. ఆ ప్రాంత స్వయం ప్రతిపత్తిని రద్దు చేసింది. భారత ఈశాన్య రాష్ట్రాల్లో పౌరసత్వ చట్టమనే పరీక్ష పెట్టింది. దీని వల్ల దాదాపు 20 లక్షల మంది ప్రజల జీవితాలు ప్రశ్నార్థకం కానున్నాయి. అందులో చాలా మంది ముస్లింలే. అయినప్పటికీ మిస్టర్​ మోదీ... పౌరసత్వ చట్టాన్ని ఆమోదం పొందేలా చేశారు. ఈ చట్టం... దక్షిణాసియాలోని ఇస్లాం దేశాలకు తప్ప... అన్ని దేశాలకు అనుకూలంగానే ఉంది. ఇదే అల్లర్లు మరింత జఠిలమవడానికి కారణమైంది." - న్యూయార్క్​ టైమ్స్​ కథనం.

"భారత్​లో పౌరసత్వ చట్టంపై ఆందోళనలు మరింత తీవ్రం" అంటూ వాల్​స్ట్రీట్​ జర్నల్​ పేర్కొంది.

"ఈ చట్టం ద్వారా.. కొంతమంది ముస్లిం శరణార్థులకు ఇబ్బంది కలుగుతుందని... అయితే ప్రధాని మోదీ భారత లౌకిక వాదాన్ని పాతరేస్తున్నారని న్యాయ విశ్లేషకులు చెబుతున్నారు." - వాల్​స్ట్రీట్​ జర్నల్​ కథనం.

"పోలీసులు విశ్వవిద్యాలయానికి వెళ్లి విద్యార్థులపై దాడి చేసిన తర్వాత భారత్​ వ్యాప్తంగా పౌరసత్వ చట్టంపై నిరసనలు మిన్నంటాయి." - వాషింగ్టన్​ పోస్ట్​

అమెరికా సభలో చర్చ...

కశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు తర్వాత సమాచార వ్యవస్థపై నిషేధాజ్ఞలు, రాజకీయ నేతల నిర్బంధంపై ఇప్పటికే రెండు సార్లు అమెరికా చట్టసభ చర్చించింది. తాజాగా పౌరసత్వ చట్టంపై ఆందోళనలు మిన్నంటడాన్ని పలువురు అమెరికా చట్టసభ్యులు ప్రస్తావిస్తున్నారు.

వ్యతిరేకత...

అమెరికాలోని అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్​, విదేశీవ్యవహారాల కమిటీ రెండూ ఇప్పటికే పౌరసత్వ చట్టం.. ప్రజాస్వామ్య మౌలిక సూత్రలపై నిర్లక్ష్యం వహించిందని పేర్కొన్నాయి. మరోవైపు ఐరాస మానవహక్కుల కార్యాలయం... పౌరసత్వ చట్టంపై ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ చట్టం వివక్షపూరితంగా... భారత అంతర్జాతీయ మానవహక్కుల విధివిధానాలకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడింది.

చర్చకు వస్తాయా!

2+2 చర్చల్లో భాగంగా విదేశాంగ విధానంపై సమగ్ర సమీక్ష సహా భద్రతా, రక్షణ సంబంధాలపై ఇరుదేశాల నేతలు సమాలోచనలు జరపనున్నారు. మానవ హక్కుల అంశం ఇందులో లేనప్పటికీ పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు చర్చకు వచ్చే అవకాశం లేకపోలేదు.

అంతర్గత వ్యవహారం...

కశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు నిర్ణయంపై అంతర్జాతీయ మీడియా కథనాలు వివక్షపూరితంగా ఉన్నాయని ఇప్పటికే భారత్​ పలుమార్లు ప్రకటించింది. ఆర్టికల్​ 370 రద్దు వంటి నిర్ణయాలు భారత అంతర్గత విషయమని విదేశాంగ మంత్రి జయ్​శంకర్​ చాలాసార్లు తెలిపారు.

చైనా ఎత్తులు...

సరిహద్దు అంశంపై భారత్​-చైనా మధ్య జరగునున్న ప్రత్యేక ప్రతినిధుల సమావేశానికి ముందు డ్రాగన్​ దేశం మరో వ్యూహం పన్నుతుంది. ఐరాస భద్రతా మండలిలో మరోసారి కశ్మీర్​ అంశాన్ని చర్చించేలా పావులు కదుపుతోంది. అయితే ఇందులో ఉన్న కొన్ని సభ్యదేశాలు చైనా ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాయి. ఫ్రాన్స్​ ఇప్పటికే కశ్మీర్​ అంశం భారత అంతర్గత వ్యవహారమని తేల్చిచెప్పింది.

అయితే కశ్మీర్​ వ్యతిరేక వ్యూహాల గురించి వేసిన ప్రశ్నలపై దిల్లీలోని చైనా రాయబారి కార్యాలయం మౌనంగా ఉంది.

- స్మితా శర్మ, సీనియర్​ జర్నలిస్ట్​.

ABOUT THE AUTHOR

...view details