భార్యను పై చదువుల కోసం అమెరికా పంపించి ఆమెకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు శ్రావణ్‌కుమార్ అనే వ్యాపారి. చదువు ముగించుకుని తిరిగి వచ్చిన భార్య ఆశ్చర్యానికి గురైంది. తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది. తమిళనాడు చెన్నైలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇదీ జరిగింది...
చెన్నైలోని పద్మనాభన్ వీధిలోని జీనథ్ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉండే శ్రావణ్‌కుమార్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రశాంతిని 2010లో వివాహం చేసుకున్నాడు. వారి వివాహ బంధం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగింది. వారికి 8 ఏళ్ల పాప ఉంది.
2016లో ప్రశాంతి పైచదువుల కోసం అమెరికా వెళ్లేందుకు నిర్ణయించుకుంది. అందుకు ఒప్పకున్న శ్రావణ్ సొంత ఖర్చుతో భార్యను విదేశాలకు పంపాడు. ఆ సమయంలో తన కూతురిని భర్త వద్దే వదిలి వెళ్లింది ప్రశాంతి. కానీ తాను అమెరికా వెళ్లేందుకు అంగీకరించిన భర్త ఆలోచనలను పసిగట్టలేకపోయింది. పై చదువులు ముగించుకుని స్వదేశానికి తిరిగివచ్చిన ప్రశాంతి.. భర్త రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకుని ఆశ్చర్యానికి గురైంది. రెండో భార్యకు ఎనిమిది నెలల పాప కూడా ఉంది.