తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హైజాక్ కథ సుఖాంతం- ప్రయాణికులందరూ సేఫ్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ ప్రయాణికుల బస్సు హైజాక్‌కు గురైంది. వాహనానికి ఆర్థికసాయం అందించిన ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులే బస్సును తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. డ్రైవర్‌, కండక్టర్‌ను దించి వారు బస్సును గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు బస్సును గుర్తించారు. ప్రయాణికులందరూ సురక్షితంగానే ఉన్నట్లు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై విపక్షాలు మండిపడుతున్నాయి.

Bus hijacked with passengers on board in Agra
హైజాక్ కథ సుఖాంతం- ప్రయాణికులందరూ సేఫ్

By

Published : Aug 19, 2020, 6:00 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో బస్సు హైజాక్​కు గురికావడం కలకలం రేపింది. 34మంది ప్రయాణికులతో వెళ్తున్న వాహనాన్ని.. బస్సుకు ఆర్థిక సాయం అందించిన ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులే హైజాక్ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రయాణిస్తున్న బస్సును ఆపి మరీ తమ స్వాధీనంలోకి తీసుకున్నారు కంపెనీ ప్రతినిధులు. డ్రైవర్‌, కండక్టర్‌ను దించి బస్సును గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు. దీంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైజాక్ అయిన ప్రైవేటు బస్సు

ప్రయాణికులు సేఫ్​

బుధవారం తెల్లవారుజామున ఆగ్రాలోని థానా మల్పూర్‌ ప్రాంతంలో హైజాక్ ఘటన జరిగింది. పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇటావా జిల్లా బలెరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ దాబా సమీపంలో బస్సును గుర్తించారు. అక్కడి నుంచి బస్సును తిరిగి తమ అధీనంలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రయాణికులందరినీ వదిలిపెట్టినట్లు వెల్లడించారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న బస్సు

బస్సులోని ప్రయాణికులు, డ్రైవర్, సిబ్బంది సురక్షితంగానే ఉన్నట్లు యూపీ హోంశాఖ అదనపు చీఫ్ సెక్రెటరీ అవనీష్ అవస్థీ స్పష్టం చేశారు. బస్సు యజమాని మంగళవారం మరణించినట్లు తెలిపారు.

అయితే యజమాని ఈఎంఐ చెల్లించకపోవడం వల్ల బస్సును ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఫైనాన్స్‌ కంపెనీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి 10:30 గంటలకు ఈ హైజాక్ వ్యవహారం ప్రారంభమైనట్లు వెల్లడించారు.

"రైభా టోల్​ ప్లాజా వద్ద రెండు ఎస్​యూవీల్లో వచ్చిన ఎనిమిది మంది యువకులు బస్సును అడ్డగించారు. ఫైనాన్స్ కంపెనీ నుంచి వచ్చామని చెబుతూ డ్రైవర్​ను దిగిపోమ్మని కోరారు. డ్రైవర్ పట్టించుకోకుండా బస్సును అలాగే పోనిచ్చాడు. ఎస్​యూవీలో వచ్చిన సిబ్బంది బస్సును వెంబడించారు. మల్​పుర ప్రాంతంలో బస్సును ఓవర్​టెక్ చేశారు. బస్సులోకి ప్రవేశించి డ్రైవర్​ను, కండక్టర్​ను బలవంతంగా దించేశారు. ప్రయాణికులకు ఎలాంటి హాని చేయమని చెప్పారు. నలుగురు వ్యక్తులు కలిసి బస్సును దిల్లీ కాన్పూర్ హైవేపైకి పోనిచ్చారు."

-బబ్లూ కుమార్, ఆగ్రా ఎస్​ఎస్​పీ.

డ్రైవర్, కండక్టర్​లను తమ వెంట తీసుకెళ్లి ఎస్​యూవీల్లో ఎక్కించుకొని.. కుబెర్​పుర్ ప్రాంతంలో తెల్లవారుజామున 4 గంటలకు రహదారిపై వదిలి వెళ్లినట్లు బబ్లూ తెలిపారు. అనంతరం వీరిరువురు పోలీస్ స్టేషన్​ను ఆశ్రయించినట్లు చెప్పారు.

మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​కు చెందిన ఓ ప్రైవేట్ ఆపరేటర్ ఈ బస్సును నడిపిస్తున్నారు. యజమాని మధ్యప్రదేశ్​ వాసి అయినప్పటికీ.. బస్సును ఉత్తర్​ప్రదేశ్​లో రిజిస్ట్రేషన్(యూపీ75 ఎం 3516)​ చేయించారు.

హైజాక్ కథ సుఖాంతం- ప్రయాణికులందరూ సేఫ్

రాజకీయ దుమారం

బస్సు హైజాక్ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ రాజకీయాల్లో వేడి రాజేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయమై యోగి సర్కార్​పై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇదేనా 'యోగి మోడల్' అంటూ కాంగ్రెస్ ఎద్దేవా చేసింది.

"ఫైనాన్స్ కంపెనీ ఈ తరహాలో బస్సును హైజాక్​ చేయడాన్ని చూస్తే రాష్ట్రంలో చట్టం ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. ఇదేనా శాంతి భద్రతల విషయంలో 'యోగి మోడల్' అంటే?"

-అజయ్ కుమార్ లల్లు, కాంగ్రెస్ స్టేట్ యూనిట్ చీఫ్

ప్రయాణికులందరూ సురక్షితంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్లు సమాజ్​వాదీ పార్టీ ట్వీట్ చేసింది.

"బస్సు హైజాక్​ ఘటన విచారకరం. యూపీలో శాంతి భద్రతల సమస్య తీవ్రంగా ఉంది. పెద్ద పెద్ద నేరాలు కూడా ఎక్కడపడితే అక్కడ జరుగుతున్నాయి. ప్రయాణికులందరి భద్రత కోసం ప్రార్థిస్తున్నాం"

-సమాజ్​వాదీ పార్టీ ట్వీట్

ABOUT THE AUTHOR

...view details