మోదీ సర్కారు చేపట్టిన చర్యల ఫలితంగా 2013-14తో పోలిస్తే ప్రత్యక్ష పన్నుల ద్వారా వచ్చే ఆదాయం 2018-19లో 78 శాతం పెరిగిందని ఆర్థిక నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. రూ.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారు ఎలాంటి ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించారు. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసేందుకు రుణం తీసుకున్న వారికి వడ్డీపై రూ. 1.50 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయిస్తున్నట్లు ప్రకటించారు.
"ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా గత కొన్నేళ్లుగా ప్రత్యక్ష పన్నుల ద్వారా ఆదాయం గణనీయంగా పెరిగింది. 78 శాతానికిపైగా వృద్ధి చెందింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల ద్వారా ఆదాయం రూ. 6.38 లక్షల కోట్లు ఉంటే 2018-19 ఆర్థిక సంవత్సరంలో అది రూ. 11 లక్షల 37 వేల కోట్లకు చేరింది. వార్షిక ఆదాయం రూ.5 లక్షలు దాటిన వారు మాత్రమే ఆదాయపు పన్నును చెల్లించాల్సి ఉంటుంది. కార్పోరేట్ పన్ను విషయానికి వస్తే ప్రస్తుతం 250 కోట్ల రూపాయల వరకు వార్షిక టర్నోవర్ ఉన్న సంస్థలు కనిష్ఠంగా 25 శాతం పన్ను చెల్లిస్తున్నాయి. ఈ పరిధిని రూ. 400 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న సంస్థలకు కూడా వర్తింప జేస్తున్నాం. 99.3 శాతం కంపెనీలు ఈ పరిధిలోకి వస్తాయి. "
- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
ప్రస్తుతం 250 కోట్ల వరకు వార్షిక టర్నోవర్ ఉన్న కార్పొరేట్ సంస్థలు 25 శాతం కార్పోరేట్ పన్ను పరిధిలో ఉండగా.. ఈ పరిధిని 400 కోట్ల వరకు వార్షిక టర్నోవర్ ఉన్న కంపెనీలకూ వర్తింపజేశారు. 250 కోట్లపైన వార్షిక టర్నోవర్ ఉన్న కంపెనీలు ప్రస్తుతం 30 శాతం కార్పోరేట్ పన్ను చెల్లిస్తున్నాయి.