విస్తరణవాద శకం ముగిసిందని, ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. చైనాతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో లద్దాఖ్‌లో పర్యటించిన మోదీ.. నిమూలో సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
"విస్తరణవాద శకం ముగిసింది. ఇది అభివృద్ధి యుగం. సామ్రాజ్యవాద శక్తులు ఓడిపోయాయనో, వెనక్కి తగ్గాయనో చెప్పడానికి చరిత్రే సాక్ష్యం."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘర్షణ గురించి మాట్లాడిన ప్రధాని మోదీ.. 14 కార్ప్స్ ప్రదర్శించిన ధైర్యసాహసాలు దేశంలోని ప్రతి ఇంట్లో ప్రతిధ్వనిస్తాయన్నారు. ఈ సందర్భంగా సైనికులు ప్రదర్శిస్తున్న శౌర్యపరాక్రమాలను కొనియాడారు. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో అమరులైన 20 మంది వీర జవాన్లకు సంతాపం ప్రకటించారు.
"దేశంలోని ప్రతి పౌరుడు మీ ధైర్యాన్ని చూసి గర్వపడుతున్నారు. నేనే కాదు దేశం మొత్తం మిమ్మల్ని విశ్వసిస్తోంది. 14 కార్ప్స్ ప్రదర్శించిన శౌర్యం గురించి ప్రతి చోటా మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఇంట్లో మీ ధైర్యసాహసాలు ప్రతిధ్వనిస్తున్నాయి. మీరు చూపించిన ధైర్యం ద్వారా భారతదేశ సామర్థ్యం గురించి ప్రపంచానికి సందేశం వెళ్లింది. ఇప్పుడు మీరున్న ప్రదేశం కంటే మీ ధైర్యం ఉన్నతమైనది. మీ త్యాగం, ధైర్యం నుంచే ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం బలపడుతుంది."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి