ఉత్తర్ప్రదేశ్ కాన్పుర్ జిల్లాలోని దిల్లీ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న 4 గ్రామాల్లో యువకులకు వివాహాలు జరగటం లేదు. అవును మీరు విన్నది నిజమే. దాని వెనకాల కారణం వింటే మీరు ఆశ్చర్యపోతారు. అవి బదువాపుర్, పన్కీ పడ్వా, జముయీ, సరయమిత్ర గ్రామాలు. ఈ ఊళ్లలో పెళ్లి కాని యువకుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.
ఇందుకు గల కారణం ఈ ఊర్లకు సమీపంలో కాన్పుర్ పురపాలక సంఘానికి చెందిన డంపింగ్ యార్డు ఉండటమే. ఈ చెత్త నుంచి వస్తోన్న దుర్గంధం వల్ల నాలుగు ఊళ్లల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జబ్బుల బారిన పడుతున్నారు. ఈ గ్రామాల్లోని యువకులకు అమ్మాయిని ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు.
ఒక్క నిమిషం కూడా..
ఇతర గ్రామాల్లోని బంధువులు తమ కూతుళ్లను ఇక్కడి యువకులకు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా.. ఇక్కడికి వచ్చిన తర్వాత మనసు మార్చుకుంటున్నారని వాపోతున్నారు ఆయా గ్రామస్థులు. డంపిగ్ యార్డు నుంచి వెలువడే దుర్గంధం, ప్రజలు జబ్బుల బారిన పడుతున్న విషయాలను గమనించి బంధుత్వాలనూ తెంచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది పెళ్లిళ్లు నిశ్చయించుకున్నా.. తర్వాత మానుకుంటున్నారని చెబుతున్నారు.
"ఏ ఇంటిలోనైనా పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఇతర గ్రామాలకు చెందిన వారు వారి అమ్మాయిని ఇచ్చేందుకు ఇక్కడకు వచ్చి గ్రామంలోని పరిస్థితిని చూసి ఒక్క నిమిషం కూడా ఉండటం లేదు. ఇక్కడి దుర్గంధాన్ని చూసి తిరిగి వెళ్లిపోతున్నారు. నా అంచనా ప్రకారం గ్రామంలో సుమారు 100 మంది యువకులు ఉన్నారు. అందులో సుమారు 70 మంది వరకు పెళ్లి కావడం లేదు."