ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులకు క్రేజే వేరు. భారత్‌లో అయితే కొంచెం ఎక్కువనే చెప్పొచ్చు. మైదానంలో అభిమానుల మనసును దోచుకుని, అదే ఆత్మవిశ్వాసంతో రాజకీయ రణరంగంలో దిగుతున్నారు క్రీడాకారులు.
దేశంలో ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో చేరిన బాక్సర్ విజేందర్ సింగ్.. దక్షిణ దిల్లీ నుంచి బరిలోకి దిగారు. ఆయనను పలకరించిన ఈటీవీ భారత్‌తో అనేక విషయాలు పంచుకున్నారు విజేందర్.
విజేందర్ సింగ్‌తో ముఖాముఖి భారత్, పాకిస్థాన్‌లో క్రీడాకారులు ఎక్కువగా రాజకీయాల్లోకి వస్తున్నారు. మీ రాజకీయ జీవితంలో లక్ష్యాలేమిటి?
పాకిస్థాన్‌లో ఇమ్రాన్‌ఖాన్ ప్రధానమంత్రి కావటం గొప్పవిషయం. దేశమేదైనా క్రీడాకారులూ రాజకీయాల్లోకి రావాలి. దేశం గర్వపడేలా చేయాలి.
మీరు భారత్‌లో పుట్టారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. అలా చూసుకున్నప్పుడు మన దేశం ఎంతమేరకు విజయం సాధించింది?
మేం పైపైకి ఎదుగుతున్నాం. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నీళ్లు, విద్యుత్ విషయంలో ప్రజలు ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు మనం అంగారకుడి గురించి మాట్లాడుతున్నాం. మరోవైపు ప్రజలకు నీళ్లు కూడా దొరకటం లేదు. ఇలా రెండు సమాజాల మధ్య అంతరం ఉండటం చింతించాల్సిన విషయం.
శ్రీలంక తరహాలో మన దేశంలో ఉగ్రవాదులు దాడులకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. బలహీనమైన ప్రభుత్వం ఉంటే వారిని అడ్డుకోవటం సాధ్యం కాదంటున్నారు. ఉగ్రవాద భయాన్ని ప్రజలపై మోదీ రుద్దుతున్నారని మీరు భావిస్తారా?
ఇలా చేయకూడదు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు భయాన్ని సృష్టిస్తాయి. అభివృద్ధి గురించి మాట్లాడండి. విద్య, ప్రగతి, యువకుల గురించి మాట్లాడండి. ఇంత పెద్ద వ్యక్తులు ఈ సమస్యలను సృష్టించటం సరైన పద్ధతి కాదు.
రాజకీయ నాయకుడిగా దిల్లీలో ఏ సమస్యల గురించి మీరు మాట్లాడాలనుకుంటున్నారు?
నిరుద్యోగం ఇంతలా పెరిగిపోతోంది. యువత ఆందోళనలో ఉన్నారు. అది చేస్తాం, ఇది చేస్తాం.. రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే 25 ఏళ్లలో ఎన్నడూ ఈ స్థాయి నిరుద్యోగ సమస్య లేదు. ఇది మాత్రం వార్తల్లో కనిపించదు. మతపరమైన సమస్యలు, జాతీయవాదంతో నక్సలిజాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇది సరికాదు.
మీరు పోటీ చేస్తున్న స్థానంలో ప్రజల మధ్య అంతరాలు ఎక్కువ. ఓ వైపు సంపన్నులు మరోవైపు పేదప్రజలు ఉన్నారు.
నిజంగా ఇది పెద్ద సవాల్. సులభమైన విషయమేమీ కాదు. కానీ కచ్చితంగా సాధిస్తా. నేను రెండు రకాల జీవితం అనుభవించాను. మా తండ్రి ఓ డ్రైవర్. 15 రూపాయలకు అమ్మ బట్టలు కుడుతుండేది. గ్రామంలో బతికాను. సంపన్నుల మధ్య నివసించాను.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చాలా సమస్యలు ఉన్నాయి. మళ్లీ ఓటర్లను హస్తం ఆకర్షించగలదా?
ఇప్పుడు కాంగ్రెస్‌ను ప్రజలు నమ్ముతున్నారు. రాహుల్, ప్రియాంక బృందాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. మేమంతా కలిసి భారత్‌లో మరోసారి అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తున్నాం.
ఇదీ చూడండి: ఎందరికో స్ఫూర్తి: గోమతి మరిముత్తు గాథ